Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజువారీ నిర్వహణలో గవర్నర్ (ఛాన్సలర్), ఉన్నత విద్యాశాఖ మంత్రి ( ప్రొ ఛాన్సలర్)లు దూరంగా వుండేలా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి
తిరువనంతపురం : వైస్ ఛాన్సలర్ల నియామకంపై కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్, వామపక్ష ప్రభుత్వానికి మధ్య ఘర్షణ తలెత్తిన నేపథ్యంలో కేరళ విశ్వవిద్యాలయాల చట్టాలను సమీక్షించేందుకు 2009లో కేరళ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేసిన ఎం.ఆనందకృష్ణన్ కమిటీ ఆనాడు చేసిన దూరదృష్టితో కూడిన సిఫారసులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
విశ్వవిద్యాలయాల రోజువారీ నిర్వహణలో గవర్నర్ (ఛాన్సలర్), ఉన్నత విద్యాశాఖ మంత్రి ( ప్రొ ఛాన్సలర్)లు దూరంగా వుండేలా చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని కమిటీ కీలక ప్రతిపాదన చేసింది. కానీ 2011లోనే ఈ కమిటీ తన తుది నివేదిక అందచేసినా ఇంతవరకు ఈ ప్రతిపాదను ఎవరూ ముందుకు తీసుకువెళ్లలేదు. '' విశ్వవిద్యాలయాల రోజువారీ నిర్వహణకు సంబంధించి ఛాన్సలర్, ప్రొ ఛాన్సలర్లను మధ్య దూరం పాటించేలా వ్యవస్థాగత చర్యలు తీసుకోవాలని కమిటీ తొలుత అభిప్రాయపడినా, సంబంధిత పక్షాల నుండి తీవ్రంగా స్పందన రావడంతో కమిటీ ఈ ప్రతిపాదను ఉపసంహరించింది. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల రోజువారీ నిర్వహణలో చాన్సలర్, ప్రొ చాన్సలర్లు జోక్యం చేసుకున్న సంఘటనలు లేవని, అందువల్ల రాష్ట్ర అనుభవాల దృష్ట్యా ఇలాంటి వ్యవస్థాగతమైన ఏర్పాట్లు అవసరపడవని సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. దాంతో ప్రస్తుతమున్న నిబంధనలే కొనసాగించవచ్చని కమిటీ సూచించింది.'' అని పేర్కొంది. జాతీయ ప్రతిష్ట కలిగిన విద్యావేత్త కాగలిగిన ఛాన్సలర్ ద్వారా గవర్నర్ తన అధికారాలను ఉపయోగించుకోవచ్చని కమిటీ సిఫారసు చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మెన్ కూడా అయిన ఉన్నత విద్యా శాఖా మంత్రి ప్రభుత్వ అభిప్రాయాలను కేరళ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (కెఎస్హెచ్ఇసి) వైస్ చైర్మన్ ద్వారా విశ్వవిద్యాలయాలకు తెలియచేయవచ్చునని కమిటీ తన ముసాయిదా నివేదికలో పేర్కొంది. ఛాన్సలర్ లేనపుడు లేదా ఆయన అసమర్ధుడైన సమయంలో ఛాన్సలర్ నిర్వహించే విధులు, కార్యకలాపాలన్నింటినీ నిర్వహించేందుకు, రాష్ట్ర ఉన్నత విద్యా మంత్రికి అధికారాలు వుండాలనే ప్రస్తుత నిబంధన అనవసరంగా వుందని పేర్కొంది. విశ్వవిద్యాలయాల చట్టాలు, నిబంధనల్లో యుజిసి నిబంధనలు, 2020ని తక్షణమే పొందుపరచాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. ''సవరించిన యుజిసి నిబంధనలపై చర్చకు అవకాశం లేదు. ప్రతి విశ్వవిద్యాలయం, యూజీసీ గుర్తించిన అనుబంధ కాలేజీలతో సహా ప్రతి సంస్థ వీటికి చట్టబద్ధంగా కట్టుబడి వుండాల్సిందే. 2010 జూన్ 30 నుంచి ఈ నిబధనలు అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలకు విరుద్ధంగా ఏ నియామకమైనా లేదా ప్రమోషన్ అయినాన చట్టవిరుద్ధమే కాగలదు.'' అని నివేదిక పేర్కొంది. విద్యా, పాలనా పరమైన విషయాల్లో విశ్వవిద్యాలయాలకు పూర్తి స్థాయి స్వయంప్రతిపత్తి వుండాలని ప్రముఖ విద్యావేత్త, అప్పటి ఐఐటి కాన్పూర్ చైర్మెన్ అయిన ప్రొఫెసర్ ఆనంద్‌కృష్ణన్ నేతృత్వంలోని కమిటీ సిఫారసు చేసింది. అయితే, ఆ కమిటీ సూచించిన రాడికల్ సంస్కరణలు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల నుండి మద్దతు లేకపోవడంతో కోల్డ్ స్టోరేజ్‌లో మగ్గిపోతున్నాయి.