Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మరొక సంచలనం నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీలుగా ఆరోపిస్తూ నాలుగు న్యూస్ ఛానళ్లను రాజ్‌భవన్‌లోకి రాకుండా నిషేధం విధించారు. కేరళ గవర్నర్ కార్యాలయం సోమవారం ఈ విషయాన్ని ప్రకటించింది. కేరళలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య యూనివర్శిటీలతో సహా విషయాలపై వివాదం నెలకున్న సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం ముందుగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దీని తరువాత రాజ్‌భవన్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మీడియా ప్రతినిధులకు ఆహ్వానం అందింది. దీంతో రాజ్‌భవన్‌కు వెళ్లగా నాలుగు న్యూస్ ఛానళ్లను అడ్డుకున్నారు. కైరాళి, రిపోర్టర్, మీడియా వన్, జైహింద్ ఛానళ్ల ప్రతినిధులను రాజ్‌భవన్‌లోకి రాకుండా అడ్డుకున్నారు. రాజకీయ పార్టీలుగా పేర్కొంటూ ఈ నాలుగు ఛానళ్ళను నిషేధించినట్లు గవర్నర్ కార్యాలయం తెలిపింది. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (కెయుడబ్ల్యూజె) ఆందోళనకు దిగింది. ఇది పత్రికా స్వేచ్ఛపై ఆక్రమణగా విమర్శించింది. గవర్నర్ నిర్ణయాన్ని ప్రతిపక్ష నేతలు కూడా తీవ్రంగా ఖండించారు. కాగా, మీడియా సమావేశంలో విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి గవర్నర్ నిరాకరించారు. జర్నలిస్టులుగా నటించే పార్టీ కార్యకర్తలకు తాను సమాధానం చెప్పనని ఖాన్ పేర్కొన్నారు.