Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేద ప్రజలపై ప్రతికూల ప్రభావం
- హిందీ మాట్లాడేవారు ఆ మూడు రాష్ట్రాల్లోనే
- కేంద్రం ప్రయత్నాలపై నిపుణులు, విశ్లేషకులు
న్యూఢిల్లీ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన మాతృసంస్థ ఆరెస్సెస్ లక్ష్యాలను పూర్తి చేసే పనిలో నిమగమైంది. ఇందుకు ప్రజల బాధలు, సెంటిమెంట్లతో సంబంధం లేకుండా నియంతృత్వ, ఏకపక్ష చర్యలకు దిగుతున్నది. ఇందులో భాగంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో హిందీ భాషను తప్పనిసరి చేసే చర్యలకు పాల్పడుతున్నది. కేంద్ర సర్కార్ ప్రయత్నాలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. హిందీ భాష మాట్లాడే రాష్ట్రాలు తప్ప.. మిగతా రాష్ట్రాలకు చెందిన రాజకీయపార్టీలు, నాయకులు, ప్రాంతీయ భాషా ప్రేమికులు మోడీ సర్కారు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నిర్ణయం హిందీయేతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ప్రజలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరించారు. ఈ విషయంలో కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గాలని చెప్పారు.భారత జాతీయవాదం సెంటి మెంటు పేరుతో బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తు న్నదన్నారు. దీనిని ఆధారంగా చేసుకొని ఒకేదేశం, ఒకే భాషను అమలు చేయాలని చూస్తున్నదని విశ్లేషకులు తెలిపారు. అయితే, అనేక సంస్కృతులు, సంప్రదాయాలు, భాషలు, వేషధారణలు కలిగి ఉన్న భారత ఉపఖండంలో ఈ విధానం ఏ మాత్రం సరికాదని కేంద్రానికి సూచించారు. సంస్కృతం లేదా పాళీలో భారతీయ సాహిత్యం జాతీయవాద భావనను పరిచయం చేయలేదని తెలిపారు.హిందీ చాలా రాష్ట్రాల్లో సమీప భాషగా అనిపించచ్చు. కానీ, ఇది అవాస్తవమని తెలిపారు. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మాత్రమే హిందీని మాట్లాడే రాష్ట్రాలని తెలిపారు. దక్షిణ భారత రాష్ట్రాలు, పశ్చిమబెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలు, కాశ్మీర్, ఊర్దూ మాట్లాడే ప్రజలకు హిందీ భాషతో సంబంధం లేదన్నారు. అయితే, ఆరెస్సెస్, బీజేపీలు అన్ని కేంద్ర సంస్థలలో హిందీని బోధించాలని కోరుకుంటు న్నాయి. డబ్బు మాత్రమే పరమావధిగా నడిచే ప్రయివేటు సంస్థల్లో ఇంగ్లీషు తప్ప హిందీ ఊసే లేకపోవటం గమనార్హం. ఈ విధానం ప్రతి హిందీయేతర రాష్ట్రంపై ప్రభావాన్ని చూపుతుందని తెలిపారు. బ్రిటీషు కాలం నుంచి కూడా హిందీ పండితులు, రచయితలు భారతదేశాన్ని ఒక దేశంగా ఇలాంటి ఆలోచనను ఎన్నడూ చేయలేదని గుర్తు చేశారు.దేశం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగవాదం, చట్టబద్ధమైన పాలన గురించి మన ఆలోచనలను బ్రిటీష్వారి నుంచి తీసుకున్నప్పుడు ఆంగ్ల భాషను కేంద్ర సంస్థల నుంచి ఎందుకు తొలగించాలి? అని విశ్లేషకులు ప్రశ్నించారు. 1817లో భారత్లో మొట్టమొదటి ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి 205 ఏండ్ల వరకు మనుగడ సాగించి జాతీయత, ప్రజాస్వామ్యం గురించి గణనీయమైన ఆలోచనలను ఇచ్చిందని వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్ లలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమమే బోధనగా ఉంటుంది. ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో చదువుకోవటం ద్వారా ధనవంతులు కావాలని పేదలు భావించటం సహజం. ''బీజేపీ నాయకుల లాగే కొంత మంది పేద, మధ్యతరగతి ప్రజలు తమ పిల్లలను ప్రయివేటు ఇంగ్లీషు మీడియం పాఠశాలలకు పంపిస్తారు. అయితే, ఆ బీజేపీ నాయకులే ఇంగ్లీషు మీడియానికి వ్యతిరేకంగా మాట్లాడటం గమనార్హం. ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు వంటి ప్రభుత్వ సంస్థల నుంచి ఆంగ్లాన్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి'' అని విశ్లేషకులు చెప్పారు. బీజేపీ నాయకులు ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకంగా, హిందీ మాధ్యమానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ.. వారి పిల్లలను కార్పొరేటు ఇంగ్లీషు మాధ్యమ స్కూళ్లలో చేర్పిస్తారనీ, ఆంగ్ల భాషా పరిజ్ఞానంతో వారు విదేశాలకు వెళ్లి జీవన ప్రమాణాలను మరింతగా పెంచుకుంటారని విశ్లేషకులు తెలిపారు. అయితే, పేద ప్రజలను మాత్రం ఆ విధంగా ఎదగనీయకుండా హిందీ భాష పేరుతో మోడీ సర్కారు రాజకీయాలు చేస్తున్నదని విశ్లేషకులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు.