Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ బలోపేతం అవుతోంది .. సోనియా గాంధీ
- బీజేపీ అసత్య, విద్వేష వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తాం.. ఖర్గే
న్యూఢిల్లీ . కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 80 ఏండ్ల మల్లికార్జున్ ఖర్గే బాధ్యతలు స్వీకరించారు. బుధవారం నాడిక్కడ ఏఐసీసీ కార్యాలయంలో నూతన అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలిత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఖర్గేకు ఆ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మెన్ మధుసూదన్ మిస్త్రీ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేం దుకు, ఉదయపూర్ చింతన్శివిర్లో తీసుకున్న నిర్ణయాలకనుగుణంగా పార్లీలో యువరక్తాన్ని నింపడం, పార్టీలో సమూలమైన చర్యలను అమలు చేస్తామన్న హామీతో 24 ఏండ్ల తర్వాత గాంధీయేతర కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 1998 నుంచి పార్టీకి నాయకత్వం వహించిన సోనియా గాంధీ, పార్టీ సీనియర్ నేతల సమక్షంలో బాధ్యలను ఖర్గేకి అప్పగించారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా సోనియా గాంధీ చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత అజరు మాకెన్ ప్రకటన చదివి వినిపించారు. అంతకు ముందు ఖర్గే రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మాజీ ఉప ప్రధాని జగ్జీవన్రామ్ల స్మారక చిహ్నాలను కూడా సందర్శించి నివాళులర్పించారు.కాగా ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ స్ఫూర్తి పొంది బలోపేతం అవుతుందన్న నమ్మకం ఉందన్నారు. ''నేను నా కర్తవ్యాన్ని నా శక్తి మేరకు నిర్వర్తించాను. ఈరోజు నేను ఈ బాధ్యత నుంచి విముక్తి పొందుతాను. నా భుజంపై బరువు తగ్గింది. నాకు ఉపశమనం కలుగుతోంది'' అని అన్నారు. ''ఇది చాలా పెద్ద బాధ్యత. ఇప్పుడు అది మల్లికార్జున్ ఖర్గేపై బాధ్యత ఉంది'' అని ఆమె అన్నారు. దేశంలోని ప్రజాస్వామ్య సూత్రాలకు తలెత్తిన ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొంటామనేదే అతిపెద్ద సవాలనీ, అయితే ఐక్యత, శక్తితో వాటిని ఎదుర్కొనేందుకు గతంలో మాదిరిగానే ముందుకు సాగుతామని అన్నారు. దేశంలో నెలకొని ఉన్న అసత్యాలు, విద్వేషాల వ్యవస్థను కాంగ్రెస్ విచ్ఛిన్నం చేస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇది తనకు ఉద్వేగభరితమైన ఘట్టమని, శ్రామికుడి కొడుకును, సామాన్య కార్యకర్తను అధ్యక్షుడిని చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియ జేస్తున్నానని అన్నారు.