Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ గవర్నర్ అల్టిమేటం
- అలా డిమాండ్ చేసే హక్కు మీకు లేదు : సీఎం పినరయి విజయన్
- ఎల్డీఎఫ్ సర్కార్‌కు వ్యతిరేకంగా వివాదాలు సృష్టిస్తున్న గవర్నర్
తిరువనంతపురం : కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ తీరు రోజు రోజుకీ హద్దులు దాటుతోంది. అంతా నా ఇష్టం..అంటూ రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా మరో వివాదానికి తెరలేపారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఉన్న కె.ఎన్.బాలగోపాల్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీఎం విజయన్‌కు లేఖ పంపారు. ఈ వ్యవహారంపై సీఎం ఘాటుగా స్పందించారు. ''ఆర్థికమంత్రి ఎలాంటి పొరపాటూ చేయలేదు. గవర్నర్ ఇలా డిమాండ్ చేయటం రాజ్యాంగ విరుద్ధ''మంటూ ట్విట్టర్లో విజయన్ సమాధానం పంపారు. ''మంత్రుల నియామకం లేదా తొలగింపు అన్నది రాష్ట్ర సీఎంకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మీ డిమాండ్‌ను నెరవేర్చటం కుదరదు'' అంటూ రాజ్‌భవన్‌కు విషయాన్ని తెలియజేశారు. మంత్రిపై చర్యలు తీసుకోవడానికి తగిన కారణాలు తనకు కనిపించడం లేదని పేర్కొన్నారు. కాబట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆర్థికమంత్రిపై తనకు అచంచలమైన విశ్వాసముందని బదులిచ్చారు.వీసీల నియామకం విషయంలో గవర్నర్, సర్కార్‌కు మధ్య నెలకొన్న వివాదం బుధవారం మరో మలుపు తీసుకుంది. ఇందు లోకి రాష్ట్ర ఆర్థికమంత్రి కె.బాలగోపాలన్ను గవర్నర్ లాక్కొచ్చారు. అక్టోబర్ 18న యూనివర్సిటీ ప్రాంగణంలో ఆర్థికమంత్రి కె.బాలగోపాల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇవి జాతీయవాద భావనకు వ్యతిరేకంగా ఉన్నాయని సీఎంకు రాసిన లేఖలో గవర్నర్ పేర్కొన్నారు. ఆర్థికమంత్రి తన విశ్వాసం కోల్పోయారని లేఖలో తెలిపారు. రాజ్యాంగబద్ధంగా ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎంకు సూచించారు. కేరళలోని 9 విశ్వవిద్యాలయాల వీసీల నియామకం విషయంలో రాజ్‌భవన్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం మొదలైంది. సుప్రీంకో ర్టు తీర్పు ప్రకారం..వీరి నియామకాలు యూజీసీ నిబంధనలకు అనుగుణంగా లేవన్నది ఛాన్స్లర్ హోదాలో ఉన్న గవర్నర్ వాదన. ఈ క్రమంలోనే వీసీలు సోమవారం ఉదయంకల్లా తనకు రాజీనామాలు సమర్పించాలని గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌ఖాన్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను నిలిపివేస్తూ కేరళ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఓ వైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే, మరోవైపు వీసీలకు గవర్నర్ నుంచి షోకాజ్ నోటీసులు అందాయి. నవంబరు 3వ తేదీలోపు బదులివ్వాలని నోటీసుల్లో సూచించారు. గవర్నర్ వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ తీరు అప్రజాస్వామ్యంగా ఉందని, రాజ్యాంగ పదవిలో ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణులు వెలువడుతున్నాయి.