Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేరాలపై ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలి
- సైబర్ నేరం ఒక పెద్ద సవాల్ : చింతన్ సివిర్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ : ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు 2024 నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కార్యాలయాలు ఏర్పాటుచేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. హర్యానా ఫరీదాబాద్‌లోని సూరజ్ కుండ్‌లో అంతర్గత భద్రతపై రెండు రోజులపాటు జరుగుతున్న చింతన్ సివిర్ను కేంద్ర హోం మంత్రి ప్రారంభించారు. ఈ చింతన్ సివిర్లో ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 16 రాష్ట్రాల హోం మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, సీమాంతర ఉగ్రవాదం, రాజద్రోహం వంటి ఇతర నేరాలను ఎదుర్కోవడానికి ఉమ్మడి ప్రణాళికను రూపొందించటంలో ఈ చింతన్ శివిర్ సహాయం చేస్తుందన్నారు. 'మన రాజ్యాంగంలో శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం. అయితే సరిహద్దులు దాటి, సరిహద్దులు లేని నేరాలపై అన్ని రాష్ట్రాలు కలిసి కూర్చుని, వాటి గురించి ఆలోచించా లి. ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించి, వాటిని అరికట్టేందుకు ప్రయత్నాలు చేసినప్పుడే మనం విజయం సాధించగలం' అన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తరువాత ఉగ్రవాద కార్యకలాపాలు 34శాతం తగ్గాయనీ, భద్రతా దళాల మరణాలు 64శాతం తగ్గాయనీ, పౌర మరణాలు 90శాతం తగ్గాయని వివరించారు. 'సహకార సమాఖ్యవాదం, మొత్తం ప్రభుత్వ విధానంలో మా లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి 3సీఎస్ -(సహకారం, సమన్వయం, సఖ్యత) -కు ప్రాముఖ్యతనివ్వాలి. వనరుల గరిష్ట స్థాయికి తీసుకెళ్లడం, ఏకీకరణ అవసరం' అన్నారు. పార్లమెంట్లో నూతన ఐపీసీ, సీఆర్పీసీలను త్వరలోనే ప్రవేశపెడతామని అన్నారు.సైబర్ నేరం దేశం, ప్రపంచం ముందు ఒక పెద్ద సవాలనీ, దీనికి వ్యతిరేకంగా పోరాడటానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. సరిహద్దు భద్రత, తీరప్రాంత భద్రతను నిర్ధారించడానికి సరిహద్దు రాష్ట్రాలు సెంట్రల్ ఏజెన్సీలు, భద్రతా బలగాలతో మరింత సమన్వయం తో ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని అన్నారు. దేశ నిర్మాణంలో కేంద్రం, రాష్ట్రాలకు సమాన బాధ్యత ఉందన్నారు. అన్ని సంస్థల మధ్య సన్నిహిత సహకారం ఉన్నప్పుడే దేశం పురోగమిస్తుందని తెలిపారు. సహకార సమాఖ్య స్ఫూర్తి మన చోదక శక్తిగా ఉండాలని చెప్పారు. ఈ చింతన్ శివిర్ ప్రాంతీయ సహకారాన్ని మరింత విస్తరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా హాజరయ్యారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు నిత్యానంద్ రారు, అజరు కుమార్ మిశ్రా, నిషిత్ ప్రమాణిక్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, మేఘాలయ, ఒరిస్సా, పుదుచ్చేరి,హర్యానా,సిక్కిం రాష్ట్రాల హోం మంత్రులు హాజరయ్యారు. మహారాష్ట్ర, నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రులు, లడఖ్, జమ్మూకాశ్మీర్‌లోని లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ కార్యక్రమానికి హాజరవుతా రు. బీహార్ నుంచి రాష్ట్ర డీజీపీ హాజరుకాగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి ఏడీజీ హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఎవరూ హాజరు కాలేదు. చింతన్ సివిర్ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించనున్నారు.