Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నరే ఉండాలని రాజ్యాంగంలో లేదు
- యూజీసీ నిబంధనల్లోనూ లేదు
- సీఎంను ఛాన్సలర్ చేస్తూ ఇప్పటికే బెంగాల్ అసెంబ్లీ తీర్మానం
- అదే బాటలో తమిళనాడు, మహారాష్ట్ర
తిరువనంతపురం : కేరళ గవర్నరు ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఇటీవల విశ్వవిద్యాలయాల వైస్ఛాన్సలర్లను రాజీనామా చేయాలని హుకుం జారీ చేసిన నేపథ్యంలో గవర్నర్ల తీరుపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. గవర్నరు పీఠం రాజ్యాంగబద్ధమైన పదవి. రాష్ట్ర ప్రభుత్వాన్ని తన ప్రభుత్వంగా భావించి రాష్ట్రంలో ప్రజా పరిపాలన సజావుగా నడిచేందుకు గవర్నరు సహకరిస్తూ స్థానిక పాలకుల సలహాలు, సూచనల మేరకు రాజ్యాంగ విధులు నిర్వహించాల్సి వుంటుంది. కానీ బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు ఒంటెద్దు పోకడలతో సాగుతోంది. బీజేపీకి నమ్మినబంటుల్లా కేంద్ర ప్రభుత్వ అజెండాను రాష్ట్రాలపై రుద్దేందుకు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారన్న విమర్శలు గవర్నర్లపై వెల్లువెత్తుతున్నాయి. కేరళ గవర్నరు ఆరీఫ్ కూడా తన హద్దులు మీరి రాష్ట్ర ప్రభుత్వానికి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు.
వాస్తవానికి విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గవర్నరే బాధ్యతలు నిర్వహించాలని రాజ్యాంగంలో ఏ అధికరణలోనూ చెప్పలేదు. విశ్వవిద్యాలయాల గ్రాంటు కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాల్లోనూ ఎక్కడ కూడా గవర్నరే ఛాన్సలర్‌గా ఉండాలన్న నిబంధన లేదు. గౌరవ ప్రదమైన ఈ పదవిని శాసనసభయే గవర్నరుకు కల్పిస్తోంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఎక్స్ అఫీషియో ఛాన్సలర్ పాత్రను రాష్ట్ర అసెంబ్లీ అప్పగించిందే మినహా..గవర్నర్‌కి ఛాన్సలర్ పాత్రను ఇవ్వాలని రాజ్యాంగంలో ఏ అధికరణలోనూ పేర్కొనడం లేదు. గవర్నర్‌పై అదనపు అధికారాలు, భారాలు మోపరాదనీ, దానివల్ల వివాదాలకు లేదా ప్రజా విమర్శలకు తావిచ్చేందుకు అవకాశం వుంటుందని 2010లో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఏర్పాటు చేసిన ఎంఎం పంచ్ఛి కమిషన్ సిఫారసు కూడా చేసింది. గవర్నర్‌ని ఎక్స్ ఆఫీషియో ఛాన్సలర్‌గా పేర్కొనే ప్రస్తుత పద్ధతిని కొనసాగించవచ్చని కేరళ రాష్ట్ర విశ్వవిద్యాలయ న్యాయ సంస్కరణల కమిషన్ ఈ ఏడాది జూన్‌లో నివేదిక అందజేసింది. అయితే ప్రస్తుత వైఖరిని కొనసాగించాంటూ రాష్ట్ర శాసనసభపై లేదా ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి లేదని కూడా అదే కమిషన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గవర్నరును ఛాన్సలర్ పదవి నుంచి తొలగిస్తే మంచిదన్న చర్చ కూడా సాగుతోంది. గౌరవ పదవిని ఆజమాయిషీ చలాయించే పదవిగా భావించి పెత్తందారీ ఆధిపత్య పోకడలతో గవర్నరు వ్యవహరిస్తే తొలగింపే మార్గమని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ముఖ్యమంత్రిని ఛాన్సలర్‌గా చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గత జూన్‌లో ఒక బిల్లు ఆమోదించింది. తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా గతంలో ఇదే బాటలో చర్యలు తీసుకున్నాయి. పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని పరిశీలిస్తోంది.