Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీబీ నివారణలో పరిస్థితులు రివర్స్
- 2021 ఏడాదిలాగే ఈ సారి కూడా
- భారత్‌లో పెరిగిన టీబీ మరణాలు
- డబ్ల్యూహెచ్ఓ నివేదిక
న్యూఢిల్లీ : భారత్‌లో టీబీ నివారణ పరిస్థితులలో పురోగతి క్షీణించింది. దేశంలో టీబీ కేసులు, మరణాలు పెరగటం.. ప్రభుత్వం వాటికి చేసే కేటాయింపులను తగ్గించటంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్‌తో పాటు ప్రపంచ దేశాలకు సంబంధించి టీబీ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కొన్ని కీలకాంశాలను తెలిపింది. 2030 నాటికి టీబీని నిర్మూలించే లక్ష్యం దిశగా ఉన్న పురోగతికి కోవిడ్-19 దెబ్బకొట్టింది. ఈ సారి కూడా 2021 నాటి పరిస్థితులే రిపీట్ అయ్యాయి. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ 2022ను విడుదల చేసింది.
ఈ నివేదికలో తెలిపిన వివరాల ప్రకారం.. అధిక టీబీ భారం ఉన్న దేశాలు నష్టాన్ని భర్తీ చేయటానికి ప్రచారాలు ప్రారంభిచాలి. అధిక టీబీ ప్రభావిత దేశమైన భారత్‌కు 2020, 2021 లలో పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. గ్లోబల్ డెడ్‌లైన్‌కు ఐదేండ్లకు ముందుగా.. అంటే 2025 నాటికి టీబీని నిర్మూలించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే, నిపుణులు వాస్తవికతలను బట్టి ఈ లక్ష్యాన్ని సందేహాస్పదంగా భావిస్తారు. 2015తో పోలిస్తే భారత్‌లో టీబీ మరణాలు 6.6 శాతం పెరిగాయి. 2020 నాటికి టీబీ మరణాలలో 35 శాతం తగ్గింపును సాధించాలనేది ప్రపంచ తాత్కాలిక లక్ష్యం. 2020తో పోలిస్తే భారత్‌లో టీబీ మరణాలు 2021లో పెరిగాయి. 4.8 లక్షల నుంచి 5.06 లక్షలకు ఈ పెరుగుదల నమోదైంది. ఈ పెరుగుదల 5.1 శాతం గమనార్హం. టీబీ మరణాలు అధికంగా నమోదైన నాలుగు దేశాలలో భారత్ ఒకటి. మిగిలిన మూడు దేశాలు ఇండోనేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్. టీబీ కేసుల నోటిఫికేషన్ (కేసుల నివేదన) గణనీయంగా తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా 2019 నుంచి 2020 వరకు రిపోర్టింగ్‌లో అత్యధిక తగ్గింపును భారత్ నివేదించింది. 2021 పరిస్థితుల్లో స్వల్ప మెరుగుదల నమోదైన్పటికీ.. ఇందులో చాలా పురోగతి అవసరం. 2019 నుంచి 2020 వరకు కేసుల నివేదనలో తగ్గుదల భారత్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ ల నుంచి 67శాతం ఉండటం గమనార్హం.
భారతదేశ వ్యక్తిగత పనితీరు విషయానికొస్తే, 2019తో పోలిస్తే 2021లో కేసు రిపోర్టింగ్‌లో 29 శాతం క్షీణత (2020లో సంబంధిత సంఖ్య 41 శాతం) ఉన్నది. దేశంలో 2020, 2021లో వరుసగా 41 శాతం, 29 శాతం కేసులు నివేదించబడలేదు. భారత్ పనితీరుతో 2013-2019 మధ్య ప్రపంచ పనితీరును ప్రభావితం చేసింది. భారత్‌లో టీబీ సంభవం లక్ష జనాభాకు 204 నుంచి 2021లో 210కి పెరిగిందని అంచనా. ఈ పెరుగుదల 2.8 శాతం కావటం గమనార్హం. 2019 స్థాయిలతో పోలిస్తే 2021లో భారత్‌లో డ్రగ్-రెసిస్టెంట్ టీబీతో బాధపడుతున్న వారి సంఖ్య 18 శాతం పెరిగింది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కేసులు భారత్‌లోనే 26 శాతంగా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో టీబీ ఇన్ఫెక్షన్లకు ఐదు ప్రధాన కారణాలను డబ్ల్యూహెచ్ఓ నిదేదిక పేర్కొన్నది. ఇందులో పోషకాహార లోపం అతిపెద్ద అంశం. అలాగే ఆల్కహల్ వినియోగం, మధుమేహం, హెచ్ఐవీ, ధూమపానం లు టీబీకి కారణమయ్యే ఇతర కారకాలుగా గుర్తించబడ్డాయి.
భారత్‌లో 2020 నుంచి 2021 వరకు నివారణ టీబీ చికిత్స రేట్లు 3.1 శాతం తగ్గాయి. అలాగే టీబీ నిధులను భారత్ దాదాపు సగానికి తగ్గించింది. టీబీ నివారణ కోసం 2020లో రూ. 2,684.36 కోట్లకు పైగా (326 మిలియన్ డాలర్లు) ఉన్న నిధులు 2021లో రూ. 1506.77 కోట్లు (183 మిలియన్ డాలర్లు) తగ్గటం గమనార్హం. టీబీపై దేశీయ వ్యయాన్ని తగ్గించే 30 దేశాలలో భారత్ రెండోది కావటం ఆందోళనకరం. ఇటీవలి కాలంలో భారత్‌కు అంతర్జాతీయ నిధులు దాదాపు రెట్టింపు అయినప్పటికీ ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవటం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా టీబీ మరణాల పెరుగుదల 2017 స్థాయికి తిరిగి వెళ్లాయి. 2021లో ఒకే వ్యాధి కారక మరణానికి కారణమైన కోవిడ్-19 తర్వాత టీబీ రెండో స్థానంలో ఉన్నది. 2021లో టీబీతో సంభవించిన మరణాలు.. హెచ్ఐవీ ఎయిడ్స్‌తో సంభవించిన మరణాల కంటే రెండింతలు ఎక్కువగా ఉన్నాయి. టీబీ నిర్మూలన విజయాలలో నష్టాలను ఎదుర్కోవటానికి నిధులను పెంచాలనీ, ప్రత్యేక నిఘా, అవగాహన కార్యక్రమాలను ప్రారంభించాలని ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ఓ పిలుపునిచ్చింది.