Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండియాకు వస్తే వైద్య పట్టాతోనే వస్తాం
- ఉక్రెయిన్‌లో భారతీయ వైద్య విద్యార్ధులు
న్యూఢిల్లీ : ఇండియాకు వస్తే వైద్యపట్టాతోనే వస్తాం.. లేదంటే చావైనా.. రేవైనా ఉక్రెయిన్‌లోనే అని తెగేసి చెపుతున్నారు ఆ దేశంలోని వైద్య విద్యార్థులు. యుద్ధ సమయంలో ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన భారతీయ వైద్య విద్యార్ధులందరూ ఇప్పుడు అక్కడికి తిరిగి వెళ్లడం సర్వత్రా చర్యణీయాంశమైంది. ఉక్రెయిన్‌పై రష్యా వరుస దాడుల నేపధ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సుమారు 1,500ల మంది భారతీయ వైద్య విద్యార్ధులను కేంద్ర ప్రభుత్వం 'ఆపరేషన్ గంగా'లో వెనక్కి తీసుకొచ్చి విషయం తెలిసిందే. ఉక్రెయిన్ నుంచి వచ్చి నెలలు గడుస్తున్న వారి సమస్యకు కేంద్రం ఎలాంటి పరిష్కారం చూపించలేదు. దీంతో ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితులు ఇంకా సర్దుమణగనప్పటికీ ఈ విద్యార్ధులంతా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని చదువుల నిమిత్తం ఉక్రెయిన్‌కు తిరిగి వెళ్లారు. నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ (ఎన్ఎంసీఏ)-2019 ప్రకారం ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు భారతీయ యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పించలేమని సుప్రీంకోర్టుకు కేంద్రం సెప్టెంబర్‌లో తెలిపింది. ఇటువంటి సడలింపులు ఇవ్వడం వల్ల దేశంలో వైద్య విద్య ప్రమాణాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.
దీంతో స్వదేశానికి తిరిగి వచ్చిన వైద్యా విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై కేంద్రం చేతులెత్తేసింది. 'ఇక్కడ రోజూ ఐదు నుంచి ఏడు ఎయిర్ సైరన్లు వినిపిస్తున్నాయి. స్టూడెంట్స్ అధిక ధరలకు ఆహారాన్ని కొనుగోలు చేయాల్సి వస్తున్నది. మాకు వేరే ఆప్షన్ లేక ఇక్కడికి తిరిగి వచ్చాం' అని మెడికల్ కాలేజీ దగ్గర తన హాస్టల్‌ని చూపిస్తూ... ఉక్రెయిన్‌లోని వినిత్సియా మెడికల్ కాలేజీలో వైద్యనభ్యసిస్తున్న బీహార్ విద్యార్థి రవి కుమార్ తెలిపారు. 'ఇప్పటికే దాదాపు 300 మంది విద్యార్థులు వినిత్సియా మెడికల్ కాలేజీకి చేరుకున్నారు. దేశ నలుమూలల నుంచి దాదాపు 1,500 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో తిరిగి అడుగుపెట్టారు. మెడికల్ డిగ్రీ నా చేతిలోకి వచ్చేంత వరకు భారత్‌కు తిరిగి రాను' అని మోహన్ అనే వైద్య విద్యార్ధి మీడియాకు తెలిపారు.