Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరువురికీ సమాన భాగస్వామ్యం
- ప్రజల భద్రతకు భరోసా : చింతన్ శివిర్‌లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
న్యూఢిల్లీ : కేరళలో ప్రజా పోలీస్ వ్యవస్థను ఏర్పాటుచేశామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నదనీ, పోలీసులు, ప్రజల భాగస్వామ్యంతో వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చామని చెప్పారు. హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్రాల హోం మంత్రుల చింతన్ శివిర్‌లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస పాలనలో పోలీసుల పాత్రకు పూర్తి భిన్నంగా ప్రజాస్వామ్య దేశంలో ఉండాలనీ, ఆలోచనా విధానంలో గణనీయమైన మార్పులు రావాలని సూచించారు. పరిశోధనలో సాంకేతిక సాధనాలకు ముఖ్యమైన స్థానం ఇవ్వాలనీ, ప్రధాన ప్రాధాన్యత ప్రజలకు స్నేహపూర్వక, పౌర కేంద్రీకృత విధానానికి ఉండాలని సూచించారు.
కమ్యూనిటీ పోలీసింగ్ ఏర్పాటు
ఆధునిక ప్రజాస్వామ్య సమాజం అవసరాలను తీర్చగల సేవా ఆధారితమైన, పౌర స్నేహపూర్వకమైన పోలీసు దళాన్ని ఏర్పాటుచేయడంలో కేరళ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కేరళలోని అన్ని పోలీస్ స్టేషన్లను జనమైత్రి (కమ్యూనిటీ పోలీసింగ్)ను ఏర్పాటుచేశామని, దీనికి కేరళ పోలీసు చట్టంతో చట్టబద్ధమైన మద్దతు ఉందని తెలిపారు. దీనివల్ల పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటారనీ, ప్రజల భద్రతకు భరోసా కల్పించడంలో పోలీసులు, ప్రజలు సమాన భాగస్వాములని స్పష్టంచేశారు. కేరళ ప్రభుత్వం కస్టడీ హింస, చిత్రహింసలకు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకుంటుదనీ, తాము ఈ విషయంలో జీరో-టాలరెన్స్ (పూర్తిగా నిర్మూలిస్తున్నాం) విధానాన్ని కలిగి ఉన్నామని తెలిపారు. మహిళలు, పిల్లలు, ట్రాన్స్జెండర్లు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజల పట్ల పోలీసులు ప్రజానుకూల విధానాన్ని అమలు చేసేలా తమ ప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. మహిళల భద్రతకు సంబంధించి మరింత పటిష్టమైన చర్యలు చేపట్టేందుకు వీలుగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ మొబిలిటీని సాంకేతిక వనరులతో మెరుగుపరచబడాలనీ, కేంద్ర ప్రభుత్వం దీని కోసం ఆర్థిక సహాయం అందించాలని కోరారు. చిన్నారుల ప్రత్యేక అవసరాలను తీర్చడానికి తాము చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్లను ప్రవేశపెట్టామనీ, అలాగే స్టూడెంట్ పోలీస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చామని చెప్పారు. ఈ మోడల్ జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిదని గుర్తుచేశారు.
మాదక ద్రవ్యాల అడ్డుకట్టకు 'యోధవు' కార్యక్రమం
మాదకద్రవ్యాల దుర్వినియోగం అత్యంత తీవ్రమైన సవాలనీ, తాము ఇటీవల 'యోధవు' కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. ఇందులో మాదకద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమిష్టిగా పనిచేస్తాయని పేర్కొన్నారు. ఈ విపత్తును ఎదుర్కోవడంలో తాము కేంద్ర ప్రభుత్వం, ఎన్సీబీ వంటి సంస్థల సహాయాన్ని అభ్యర్థిస్తున్నామని అన్నారు. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా పెరిగాయని, సివిల్ డిఫెన్స్ వాలంటీర్ల సహకారంతో అత్యవసర కార్యకలాపాలను నిర్వహించడానికి పోలీసు బలగాలను సన్నద్ధం చేయాలని సూచించారు. విపత్తు నిర్వహణలో పోలీసు సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి సాంకేతిక సహాయం తక్షణం అవసరమని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నామనీ, తాము ఎక్కడిక్కడే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర స్థాయిలో హైటెక్ సెల్, అన్ని జిల్లా కేంద్రాలలో సైబర్ సెల్‌లను ఏర్పాటు చేశామన్నారు. తాము తమ సైబర్ వాలంటీర్ల భాగస్వామ్యంతో ఇంట్లోనే డార్క్ వెబ్ మానిటరింగ్ టూల్‌ను కూడా అభివృద్ధి చేసామని వివరించారు.
ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలు అప్‌గ్రేడ్ చేయాలి
జాతీయ భద్రతలో తీర భద్రత ముఖ్యమైన అంశమనీ, కేరళలో మూడు దశల్లో తీర ప్రాంత భద్రతా పథకం అమలు చేస్తున్నామని అన్నారు. మొదటి రెండు దశల్లో 18 కోస్టల్ పోలీస్ స్టేషన్లు పని చేస్తున్నాయనీ, మూడో దశలో మరో ఏడు పోలీస్ స్టేషన్లు ప్రతిపాదించామని చెప్పారు. తాము మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి పోలీసు, ప్రజలతో ప్రచారాన్ని కూడా ప్రారంభించామని అన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలు అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా అప్గ్రేడే చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని తీసుకురావాలని సూచించారు.