Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలం చెల్లిన చట్టాలను తొలగించండి
- రాష్ట్రాల హోం మంత్రుల చింతన్ సివిర్లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : ''ఒకే దేశం, ఒకే పోలీస్ యూనిఫాం'' అంశాన్ని పరిశీలించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలో ఫేక్‌న్యూస్‌ను నిరోధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. హర్యానాలోని సూరజ్ కుండ్‌లో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్రాల హోం మంత్రుల చింతన్ సివిర్ శుక్రవారం ముగిసింది. అంతకముందు ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చింతన్ సివిర్ను ఉద్దేశించి మాట్లాడారు. సహకార సమాఖ్యతత్వానికి ఈ మేధోమథన శిబిరమే ఒక ఉదాహరణ అన్నారు. రాజ్యాంగం ప్రకారం శాంతి భద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోనిదే అయినప్పటికీ, అవి దేశ సమైక్యత, సమగ్రతలతో సమానంగా ముడిపడివున్నాయని తెలిపారు. 'ప్రతి రాష్ట్రం ఒకదాని నుంచి మరొకటి నేర్చుకోవాలి. పరస్పరం స్ఫూర్తి పొందుతూ.. దేశాభ్యున్నతికి కృషి చేయాలి' అన్నారు. దేశం ఎప్పుడైతే బలోపేతం అవుతుందో అప్పుడే ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం శక్తిని పుంజుకోవడం తథ్యమని చెప్పారు. శాంతి భద్రతల వ్యవస్థకు, రాష్ట్రాల అభివద్ధికి మధ్య అవినాభావ సంబంధం ఉందని స్పష్టంచేశారు. నేరం జరిగే ప్రదేశానికి పోలీసులు చేరుకోవడాన్ని ప్రభుత్వమే తక్షణం తమవద్దకు వచ్చినట్టుగా ప్రజలు పరిగణిస్తారనీ, కరోనా కాలంలో పోలీసుల సేవలతో ప్రజల్లో వారి ప్రతిష్ట పెరిగిందని అన్నారు. పోలీసులపై ప్రజల్లో అవగాహన మరింత బలోపేతం కావాలని పేర్కొన్నారు. ఈ మేరకు వారికి మార్గనిర్దేశం చేయడం మన నిరంతర ప్రక్రియగా ఉండాలని స్పష్టం చేశారు.
కేంద్ర, రాష్ట్ర వ్యవస్థల మధ్య పరస్పర సహకారం కీలకం
కాలం చెల్లిన చట్టాలు, నిబంధనలను విశ్లేషించి అనవసరమైన వాటిని తొలగించాలని రాష్ట్రాలను ప్రధాని మోడీ కోరారు. నేరాలు ఇప్పుడు స్థానికతకు పరిమితం కావనీ, అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయి నేర సంఘటనలో పెరుగుతున్నాయని గుర్తు చేశారు.
అందుకే కేంద్ర, రాష్ట్ర వ్యవస్థల మధ్య పరస్పర సహకారం కీలకమని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లోని విభిన్న సాంకేతికతలు పరస్పరం పని చేయలేవనీ, కాబట్టి ఉమ్మడి వేదిక (పోలీస్ టెక్నాలజీ మిషన్) అవసరమని అన్నారు. రాష్ట్రాల పోలీసు వ్యవస్థలు ఫోరెన్సిక్ సైన్స్‌లో సామర్థ్యాలను పెంచుకోవాలనీ, అందుకు జాతీయ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ''ఫేక్ న్యూస్‌ను వ్యాప్తి చేయడాన్ని నిరోధించగలిగిన సాంకేతికతను మనం ఆవిష్కరించాలి' అన్నారు. ఉగ్రవాదం క్షేత్ర స్థాయి నెట్ వర్క్‌ను రూపు మాపవలసిన అవసరం ఎంతయినా ఉందని ప్రధాని మోడీ అన్నారు.
నక్సల్స్ ప్రభావిత జిల్లాల సంఖ్య తగ్గింది
ఎనిమిదేండ్లలో దేశంలో నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య తగ్గాయని అన్నారు. పట్టణాలకు ప్రవాసం పోయే వారిని తిరిగి వారి స్వస్థలాలకు తీసుకురావడాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాలు, కోస్తా తీర ప్రాంతాలను అభివృద్ధి పరచడం కోసం మిషన్ మోడ్‌లో పాటుపడుతోందని తెలిపారు.
ఆయా ప్రాంతా లలో ఆయుధాలు, మాదక పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకోవడం లో ప్రభావాన్ని చూపగలుగుతుందని అన్నారు. డీజీపీల సమావేశాలలో నిర్ణయాలను అధ్యయనం చేయాలని కోరారు. 'ఈ చింతన్ శిబిరంలో, ఒక మార్గసూచీతో పాటుగా మెరుగైన సూచన లు వెల్లడి అవుతాయి. మీకు అంతా మంచే జరగాలి అని నేను కోరుకుంటున్నాను'' అంటూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.