Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్‌లో దారుణం
- విచారణకు ఎన్సీడబ్ల్యూ బృందం
జైపుర్: రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో రుణాల చెల్లింపుల కోసం బాలికలను వేలం వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై విచారణ కోసం జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) శుక్రవారం ఇద్దరు సభ్యులతో నిజ నిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. భిల్వారా జిల్లాకు దర్యాప్తు బృందాన్ని పంపినట్లు కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ వెల్లడించారు. భిల్వారా జిల్లాలో అనేక సెటిల్‌మెంట్‌ల్లో ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు లేదా రుణాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి 8 నుంచి 18 ఏండ్ల మధ్య ఉన్న బాలికలను రూ. 50 విలువైన స్టాంపు పేపర్‌పై వేలం వేస్తారని ఈ నెల 25న హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్లో వార్త వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఆడ పిల్లలను విక్రయించకపోతే, వివాదాల పరిష్కారం కోసం వారి తల్లులను కుల పంచాయితీల ఆదేశంతో అత్యాచారం చేస్తారని తెలిపింది. అలాగే వేలం వేసిన అమ్మాయిలను ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ముంబయి, ఢిల్లీలతో పాటు విదేశాలకు కూడా పంపారని తెలిపింది. బాధితుల వివరాలను కూడా పత్రిక ప్రచురించింది. ఈ వార్తలపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని రాజస్థాన్ ప్రధాన కార్యదర్శిని ఎన్సీడబ్ల్యూ ఆదేశించింది. అలాగే ఈ సంఘటనలపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర డిజిపిని ఆదేశించింది. అలాగే నిజనిర్థారణ బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపింది. 'భిల్వారా జిల్లాకు బృందం వెళ్లింది. దీనిపై నవంబర్ 1న రాజస్థాన్ చీఫ్ సెక్రెటరీ, భిల్వారా ఎస్పీతో సమావేశం కానున్నాను. గత కొద్ది సంవత్సరాలుగా ఈ తరహా ఘటనల గురించి వార్తలు వస్తున్నా.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు' అని రేఖా శర్మ తెలిపారు. అలాగే ఈ వార్తలపై ఆ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా దీనిపై స్పందించింది. మీడియా కథనాలను సుమోటోగా స్వీకరించింది.అయితే ఈ వార్తలను రాజస్థాన్ మంత్రి ప్రతాప్ ఖచారియావాస్ ఖండించారు. 'ఇలాంటి ఘటనల్లో విచారణ పూర్తయ్యేవరకు వాస్తవాలు తెలుసుకోలేం. దీనిపై జాతీయ మహిళా కమిషన్ మొదట రాజస్థాన్ పోలీసులతో మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో బాలికల అమ్మకాలు జరగడం లేదు' అని అన్నారు.