Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామ గ్రామాన ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు జాతా
- ఉపాధిలేమి, అవినీతి రాజ్యమేలుతున్నాయి : రైతు సంఘం నాయకులు
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన నవంబర్ 1 నుంచి 20వరకు జాతాను చేపట్టాలని లెఫ్ట్ ఫ్రంట్ నిర్ణయించింది. పార్టీ పిలుపుమేరకు ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ, ఆల్ ఇండియా కిసాన్ సభ..'చోర్ తారో..గ్రామ్ బచావో' (దొంగను తరిమికొట్టండి, గ్రామాన్ని రక్షించండి) అనే నినాదంతో వీధుల్లోకి రాబోతున్నాయి. పంచాయతీ ఎన్నికలనాటికి ప్రజలను చైతన్యం చేయటం ఈ జాతా ప్రధాన ఉద్దేశమని వామపక్షాల కూటమి ప్రకటించింది. ఏఐఏడబ్ల్యూయూ కార్యదర్శి అమియా పాత్ర మాట్లాడుతూ..''నవంబర్లో ప్రజల ముందుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీఎంసీ నాయకులు రాగానే పేదలు తమ సమస్యలను చెప్పుకునేందుకు వెళాతారు. తమకు 100 రోజుల పని ఎందుకు కల్పించలేదని వారు కచ్చితంగా ప్రశ్నిస్తారు'' అని అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రాంతీయ కృషక్ సభ అధ్యక్షుడు విప్లవ్ ముజుందార్ మాట్లాడుతూ..''గత దశాబ్దకాలంగా గ్రామాల్లో ప్రజలు మోసానికి గురవుతున్నారు. ఉపాధి లేమి బాధిస్తోంది. దేనిమీదనైనా నిరసనకు దిగితే టీఎంసీ గూండాలు దాడులకు తెగబడుతున్నారు. తృణమూల్ మద్దతుతో దోపిడీదారులు గ్రామాల్లో పాతుకుపోయారు'' అని చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రరూపం దాల్చిందని, దీనికి మూలకారణం తృణమూల్ పాలనేనని వామపక్షాల కూటమి ఆరోపిస్తోంది. టీఎంసీ నాయకుల అవినీతి, హింసాత్మక రాజకీయాల కారణంగా రాష్ట్రం నాశనమవుతోందని, అధికార పార్టీ నాయకులు, మంత్రులు అవినీతితో ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని, ఈ విషయాలన్నీ జాతా ద్వారా గ్రామాల్లోకి తీసుకెళ్తామని లెఫ్ట్ ఫ్రంట్ నాయకులు చెబుతున్నారు.