Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతుల్లో ఇద్దరు రైతులు, వ్యవసాయ కార్మికుడు
కడప : విద్యుదాఘాతానికి ముగ్గురు బలయ్యారు. వారిలో ఇద్దరు రైతులు, ఒక వ్యవసాయ కార్మికుడు ఉన్నారు. రైతులిద్దరూ అన్నదమ్ములు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం... కడప జిల్లా చాపాడు మండలం చియ్యపాడు గ్రామానికి చెందిన అన్నదమ్ములైన రైతులు పెద్దిరెడ్డి ఓబుల్‌రెడ్డి (65), పెద్దిరెడ్డి బాలఓబుల్రెడ్డి (60) తమ వరి పొలానికి పురుగుల మందు పిచికారీ చేయడానికి వ్యవసాయ కార్మికుడు బోమ్ము మల్లికార్జున్‌రెడ్డి (23)ను తీసుకొని ఉదయాన్నే వెళ్లారు. ఆ పొలంపైనుంచి విద్యుత్తు వైర్లు వెళ్తున్నాయి. వాటిలో ఒకవైరు తెగి కిందపడిపోయింది. మందుపిచికారీ చేస్తుండగా ఆ పొలం మధ్యలో కనిపించకుండా పడి ఉన్న విద్యుత్తు వైర్ తగలడంతో మల్లికార్జున్‌రెడ్డి విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆయనను కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు రైతులూ విద్యుదాఘానికి లోనయ్యారు. మొత్తం ముగ్గురూ మృతి చెందారు. దీంతో, గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలాన్ని మైదుకూరు డిఎస్సి వంశీధర్‌గౌడ్ పరిశీలించారు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని మృతుల కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చాపాడు ఎస్ఐ డాక్టర్ నాయక్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.