Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిటిషన్ను విచారించనున్న సుప్రీం
న్యూఢిల్లీ : బ్యాలెట్ పత్రాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పై పార్టీ చిహ్నాలను తొలగించి, వాటి బదులు అభ్యర్థుల వయస్సు, విద్యార్హతలు, ఫోటోలు ముద్రించాల్సిందిగా భారత ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టు ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను సుప్రీం కోర్టు సోమవారం నాడు విచారించనుంది. ఇటువంటి చర్య ఎన్నికయ్యేవరకు ఉపయోగపడుతుందని, తెలివితేటలు కలిగిన, నిజాయితీ గల అభ్యర్థులకు మద్దతు దొరుకుతుందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. టిక్కెట్ల పంపిణీలో రాజకీయ పార్టీ నేతల నియంతృత్వాన్ని నియంత్రించడానికి ఇది పనికివస్తుందన్నారు.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఎస్ఆర్ భట్, బెలా ఎం త్రివేదితో కూడిన బెంచ్ ఈ పిటిషన్ను విచారిస్తుందని భావిస్తున్నారు. న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎంలపై పార్టీ చిహ్నాలను ఉపయోగించడం చట్టవిరుద్ధమని, రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. అవినీతిని, నేరపూరిత రాజకీయాలను నిర్మూలించేందుకు అత్యుత్తమమైన మార్గమేమంటే బ్యాలెట్ పత్రాలు, ఈవీఎంలపై రాజకీయ పార్టీల చిహ్నాలను తొలగించి, వాటి స్థానంలో అభ్యర్థుల వివరాలు ముద్రించడమేనని పిటిషన్ పేర్కొంటోంది.