Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ కీలక నిర్ణయం
- ఉత్తరాఖండ్, హిమాచల్‌లోనూ కమిటీలు..
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలవేళ గుజరాత్లో బీజేపీ సర్కార్ మతపరమైన మరో ఎజెండాను సిద్ధం చేసుకుంది. ఉమ్మడి పౌరస్మృతిని గుజరాత్లో అమల్లోకి తీసుకొస్తామని బీజేపీ సర్కార్ ప్రకటించింది. ఇందుకోసం ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేయాలని శనివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతున్నవేళ, రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బీజేపీ ఈ హామీతో హిందూ ఓటర్లను ప్రభావితం చేసింది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలకు దీనిని ప్రధాన ఎజెండాగా చేయడానికి సిద్ధమైందని, మెజార్టీ హిందువుల్ని మతపరంగా భావోద్వేగానికి గురిచేయటం ప్రధాన లక్ష్యంగా ఈ ఎత్తుగడ వేసిందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ ట్విట్టర్లో వెల్లడించారు. ''రాష్ట్ర మంత్రివర్గం ముఖ్య నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అవసరాన్ని పరిశీలించేందుకు రిటైర్ట్ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కమిటీ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఉమ్మడి పౌరస్మృతిపై ముసాయిదాను సిద్ధం చేస్తుంది'' అని తెలిపారు. ఈ ఏడాది ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ ఈ హామీతో ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన పుష్కర్‌సింగ్ ధామి..యూసీసీని అమల్లోకి తేవటంపై హైపవర్ కమిటీని ఏర్పాటుచేశారు. గోవాలో ఇప్పటికే ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది. ఇక ఒకసారి ఉమ్మడి పౌరస్మతి అమల్లోకి వస్తే.. వివాహం, వారసత్వం, ఆస్తి హక్కులకు సంబంధించి ఒకే చట్టం అమల్లో ఉంటుంది. అంటే హిందూ వివాహ చట్టం-1955, హిందూ వారసత్వ చట్టం-1956 లేదా భారత వారసత్వ చట్టం-1925, షరియత్ చట్టం-1937 వంటివి ఇక చెల్లుబాటులో ఉండవు.