Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలువురికి గాయాలు.. వీడియో జర్నలిస్టుపై దాడి
- పోలీసు జీపుతో సహా పలు వాహనాలు ధ్వంసం
- మేఘాలయలో ఘటన
షిల్లాంగ్ : మేఘాలయలో నిరుద్యోగులు భారీ ఎత్తున చేపట్టిన నిరసన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలనే డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లో వారు ఈ నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీలో నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఈ ర్యాలీ అల్లర్లకు దారి తీసింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. పోలీసు జీపుతో సహా పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దాడికి గురైనవారిలో ఒక వీడియో జర్నలిస్టు కూడా ఉండటం గమనార్హం. ఫెడరేషన్ ఆప్ ఖాసీ జైన్షియా అండ్ గరో పీపుల్ (ఎఫ్కేజేజీపీ) ఈ నిరసన ర్యాలీని నిర్వహించింది. ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని గత కొంత కాలం నుంచి ఎఫ్కేజేజీపీ డిమాండ్ చేస్తున్నది.
పోలీసులు, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ (కేఎస్‌యూ), రి భోరు యూత్ ఫ్రంట్ (ఆర్బీవైఎఫ్), హైన్యూట్రెప్ నేషనల్ యూత్ ఫోర్స్ (హెచ్ఎన్వైఎఫ్) లు, పలు ఎన్జీఓలు ఎఫ్కేజేసీపీ ర్యాలీలో భాగస్వామ్యమయ్యారు. వందలాది మంది నిసనకారులు వీధుల గుండా యాత్రలో పాల్గొన్నారు. బ్యానర్లు చేతబట్టుకొని నినాదాలు వినిపించారు. పబ్లిక్ ర్యాలీ అనంతరం నిరసనకారులు మదన్ ల్యూరీన్ఘెప్ వద్ద గుమిగూడారు. మేఘాలయ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించటానికి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేది యువతను డ్రగ్స్, ఇతర సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటానికి దారి తీస్తున్నదని జేఎస్‌యూ అధ్యక్షుడు ట్రెరుబొర రౌల్ సుచేన్ తెలిపారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించటంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకపోవటంతో ర్యాలీ అనివార్యమైందన్నారు.
ర్యాలీ అలర్ల ఘటనకు సంబంధించి పోలీసులు రెండు కేసులను నమోదు చేసినట్టు ఈస్ట్ ఖాసీ హిల్స్ నగర ఎస్పీ వివేక్ సియమ్ తెలిపారు. అల్లర్లు చెలరేగటంతో ర్యాలీ జరిగే రూట్లో ఉన్న దుకాణాలను అధికారులు మూసివేయించారు. ర్యాలీ నిర్వహణలో నిబంధనలు పాటించటంలో విఫలమైనందుకు నిర్వాహకులకు నోటీసులను జారీ చేశారు. అల్లర్లకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలంటూ ఈస్ట్ ఖాసీ హిల్స్ జిల్లా డిప్యూటీ కమిషనర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.