Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మికుల వేతనాలపై ద్రవ్యోల్బణం దెబ్బ
- వేతనాన్ని మింగేస్తున్న నిత్యావసర సరుకుల ధరలు
- ఐదేండ్లలో వేతనంలో పెరుగుదల రూ.77..
- 14 కోట్లమందికి వ్యవసాయ పనుల ద్వారా ఉపాధి..
- ప్రభుత్వరంగంలో వ్యయం పడిపోవటం వల్లే : ఆర్థిక నిపుణులు
న్యూఢిల్లీ : 'ఘడియ తీరక లేదు..గవ్వ రాబడి లేదు' అన్నట్టుంది దేశంలోని వ్యవసాయ కార్మికుల పని. కార్మికులకు దక్కుతున్న వేతనాలకు...పెరిగిన ధరలకు పొంతనలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభం తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. మనదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో భూమిలేని పేదలెంతో మంది ఉన్నారు. వారు రోజూ కూలి పనికి పోతేనే చేతికి నాలుగు రూపాయలు వస్తాయి. ఒక అధ్యయనం ప్రకారం 14కోట్ల మందికి వ్యవసాయ పనులే జీవనోపాధి. గత కొన్నేండ్లుగా వీరికి దక్కుతున్న వేతనాలు...అధిక ద్రవ్యోల్బణం దెబ్బకు కరిగిపోతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయ పనులు, వ్యవసాయేతర పనులతో పొట్ట పోసుకుంటున్న కార్మికుల బతుకు నేడు అత్యంత దయనీయంగా మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేతనాల్ని మింగేస్తోంది..
2017-2022 మధ్య ఐదేండ్ల కాలంలో వ్యవసాయ కార్మికుల సగటు వేతనాలు ఎంత ఉన్నాయి? ఎంత పెరిగాయి? ద్రవ్యోల్బణంలో పెరుగుదల ఎంతుంది? అన్నది కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసిన లేబర్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదేండ్లలో కార్మికుల వేతనాల్లో సగటు పెరుగుదల..కేవలం రూ.15 మాత్రమే ఉంది. సెప్టెంబర్ 2017లో వ్యవసాయ కార్మికుడి సగటు వేతనం (పురుషులది) రూ.266 కాగా, ఆగస్టు 2022లో అది రూ.343కు చేరుకుంది. ఐదేండ్లలో పెరుగుదల రూ.77కు పరిమితమైంది. మరోవైపు నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు, ఇంధనం..మొదలైనవి భారీగా పెరిగిపోయాయి. ఐదేండ్లలో వినియోదారుల ధరల సూచిక (సీపీఐ) 29శాతం పెరిగింది. రిటైల్ మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో సరుకుల ధరలు మరింత పెరిగాయి. వీటి వాస్తవ గణాంకాలు అధికారిక లెక్కల్లో కనిపించటం లేదు. అధిక ద్రవ్యోల్బణం కార్మికుల వేతనాన్ని మింగేస్తోంది.
వ్యవసాయ కార్మికులకు మెరుగైన వేతనాలు లభిస్తే..వారి జీవన పరిస్థితులు మెరుగుపడతాయి. దీనివల్ల ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుంది. 14కోట్లమంది కొనుగోలు శక్తి పెరగటం..ఆర్థిక వ్యవస్థకు నిర్ణయాత్మకం అవుతుంది. డిమాండ్‌ను సృష్టిస్తుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తిని విస్తరిస్తుంది. ఇతర రంగాల ఉపాధిని పెంచటంలో సహాయపడుతుంది. అయితే మోడీ సర్కార్ ఇవేవీ సీరియస్‌గా తీసుకోవటం లేదని నిపుణులు చెబుతున్నారు.
మహిళలకు సగటు వేతనం రూ.269
అతి తక్కువ వేతనాల కారణంగా కార్మికులు వ్యవసాయేతర పనుల వైపునకు మరలుతున్నారు. సాగు కాలంలో భూమి దున్నటం, నాట్లు వేయటం, కలుపు తీయటం, పంట కోతలు...మొదలైన పనులు దక్కుతున్నాయి. సాగు కాలమంతా పని ఒకే రీతిగా ఉండదు. దాంతో ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లుగా ఉపాధి వెతుక్కుంటున్నారు. సమాజంలో నెలకొన్న తీవ్రవైన కుల వివక్ష ఎస్సీ, ఎస్టీల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత తక్కువ వేతనాలుండే పనులకు ఎస్సీ, ఎస్టీలను తీసుకుంటున్నారు. లేబర్ బ్యూరో గణాంకాల ప్రకారం, ఆగస్టు 2022నాటికి స్వీపింగ్, క్లీనింగ్ కార్మికుల సగటు రోజు వేతనం రూ.290, మహిళలకు రూ.269 అందుతోంది.
నయా ఉదారవాదమిది
దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడానికి ప్రధాన కారణం కొనుగోలు శక్తి పడిపోవటమే. అత్యధిక మంది తక్కువ వేతనాలతో బతుకు వెళ్లదీస్తున్నారు. వారికి వస్తున్న వేతనాలతో అత్యవసరమైన వస్తువులను, సేవలను కొనుగోలు చేయలేకపోతున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థలో చాలా పరిమితమైన డిమాండ్‌ను సూచిస్తోంది. కోవిడ్ సంక్షోభ సమయాన నిరుద్యోగ కార్మికులను కార్మికశక్తికి దూరంగా ఉంచటం ద్వారా కార్పొరేట్ కంపెనీల లాభాలు మెరుగ్గా ఉంటాయన్న పాలసీని మోడీ సర్కార్ ఎంచుకుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యయాన్ని గణనీయంగా తగ్గించాలన్న నయా ఉదారవాద విధానాల ఫలితమిది. కార్మికుల్ని కుంగదీయటం, వేతనాలు తక్కువ ఉండటం..వాణిజ్య సంబంధాల్ని ప్రభావితం చేస్తాయి. ప్రయివేటు, కార్పొరేట్ లాభాల మార్జిన్ ఎక్కువగా ఉన్నంత కాలం ఈ సమస్య పరిష్కారం కాదు. ఈ విషయాలన్నీ క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలుస్తున్నాయి. దాంతో పథకాలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతో మోడీ సర్కార్ హడావిడి చేస్తోంది.