Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులు, నిరుద్యోగం, అధిక ధరలు ప్రధాన అంశాలుగా సీపీఐ(ఎం)
- డబుల్ ఇంజిన్ పేరుతో అభివృద్ధిపై ఆశలు కల్పిస్తోన్న బీజేపీ
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (నవంబర్ 12న) దగ్గర పడుతున్నకొద్దీ..ప్రజా సమస్యలు తెరపైకి వస్తున్నాయి. యాపిల్‌ను సాగు చేస్తున్న రైతుల సమస్యలు, ఇంధన ధరలు, ఎరువుల ధరలు, రవాణా వ్యయం, జీఎస్టీ పన్ను పెంపు, నిరుద్యోగం..ఇవన్నీ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా వివిధ పార్టీలు లేవనెత్తుతున్నాయి. డబుల్ ఇంజన్, అవినీతి నిర్మూలన, ఉమ్మడి పౌరస్మృతి అంశాలతో బీజేపీ ఓటర్లను ప్రభావితం చేస్తోంది. రైతు సమస్యలు, నిరుద్యోగం, జీఎస్టీ దోపిడి, ఎరువులు, ఇంధన ధరలపై సీపీఐ(ఎం) చాలాకాలంగా రాష్ట్రంలో పలు నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. 68 అసెంబ్లీ స్థానాల్లో 11చోట్ల సీపీఐ(ఎం) తన అభ్యర్థుల్ని బరిలో నిలిపింది. అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనల్లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాపిల్ ప్యాకేజింగ్ డబ్బాపై జీఎస్టీని ఉపసంహరించాలని, ఎరువుల సబ్సిడీ అందించాలని, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా యాపిల్స్ కొనుగోలు చేయాలని ఏఐకేఎస్ డిమాండ్ చేస్తోంది.
యాపిల్ పెంపకందార్లు, ఏజెంట్లు, ప్రభుత్వంతో కూడిన స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఇవేవీ కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల ఎజెండాలో లేవు. డబుల్ ఇంజిన్ పేరుతో బీజేపీ అభివృద్ధిపై ప్రజలకు గొప్ప ఆశలు కల్పిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై హిమాచల్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నాయకుల అంతర్గత కుమ్ములాటలతో బీజేపీ సతమతమవుతోంది. ఇటీవల ఎన్నికల ర్యాలీ సందర్భంగా ప్రధాని మోడీ, 3125 కి.మీ గ్రామీణ రహదారుల అప్‌గ్రేడ్ చేయడానికి పథకాన్ని ప్రారంభించారు. ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్కు తప్ప మరోటి కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హిమాచల్ అసెంబ్లీలో 68 స్థానాలున్నాయి. వివిధ పార్టీలకు చెందిన 550 మంది నామినేషన్లు వేశారు. 17 సీట్లు ఎస్సీలకు, మూడు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 55,74,793. ఇందులో మొదటిసారటి ఓటు హక్కు వినియోగించుకునేవారు 1.86 లక్షలు. గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తూ వస్తున్నాయి.
యాపిల్ రైతు..నిరుద్యోగం
గత ఐదేండ్లుగా యాపిల్ రైతులు ఆందోళనబాట పడుతున్నారు. భారీ నిరసనలకు దిగుతున్నారు. పెరిగిన ఉత్పత్తి వ్యయం, వాతావరణ వైరుధ్యాలు, ఇంధన, ఎరువుల ధరలు వంటివి చర్చనీయాంశమయ్యాయి. పెద్ద పెద్ద వ్యవసాయ పరిశ్రమల వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గుచూపుతున్నాయని, సామాన్య రైతు కష్టాలు కనపడటం లేదని ఆగ్రహం వ్యక్తమవుతోంది. జీఎస్టీ పన్నుల పెంపు, రవాణా వ్యయం పెరగటం రైతుల్ని తీవ్రంగా వేధిస్తోంది. బీజేపీ పాలనే దీనికి కారణమని కాంగ్రెస్, వామపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. యాపిల్స్‌కు కనీస మద్దతు ధర అమలు కావటం లేదు. ఇది అత్యధికమందిని వేధిస్తోంది. బీజేపీ హయాంలో రాష్ట్రంలో నిరుద్యోగం పతాక స్థాయికి చేరింది. జాతీయ సగటు అక్టోబర్‌లో (సీఎంఐఈ ప్రకారం) 7.8శాతం కాగా, హిమాచల్‌లో 9.2శాతం నమోదైంది. ప్రభుత్వశాఖల్లో నియమకాలు తగ్గటం, రైతాంగం సంక్షోభంలో కూరుకుపోవటం ఉపాధి సమస్యకు ప్రధాన కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది కూడా హిమాచల్ ఎన్నికల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.