Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోర్బీలో కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి
- 70 మంది మృతి.. సంఖ్య పెరిగే అవకాశం
- ప్రమాద సమయంలో వంతెనపై 400 మంది
- బ్రిడ్జి 140 ఏండ్ల బ్రిటీషు కాలం నాటిది
- ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా ఐదురోజుల క్రితమే రీఓపెన్.. అంతలోనే ప్రమాదం
- సామర్థ్యానికి మించిన బరువే కారణం?
గాంధీనగర్ : గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. మోర్బీలోని మచ్చూ నదిపై నిర్మించిన బ్రిటీషు కాలం నాటి 140 ఏండ్ల చరిత్ర కలిగిన కేబుల్ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 70 మంది మంది వరకు మృతి చెందారు. పలువురికి గాయాల య్యాయి. వీరిలో మహిళలో, చిన్నారులూ ఉన్నారు. బ్రిడ్జి కూలిపోవటంతో బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రదేశమంతా భయానకంగా మారింది. ప్రమాద సమయంలో బ్రిడ్జిపై దాదాపు 400 మంది ఉన్నారు. వీరిలో వంద మంది నదిలో పడిపోయారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. రక్షణ చర్యలను కొనసాగించాయి. ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తరలించటానికి అధికారులు, పోలీసులు అంబులెన్సులను ఏర్పాటు చేశారు. అయితే, ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్యపై గుజరాత్ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారమూ రాలేదు.అధికారులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఈ ప్రమాదానికి సంబంధించిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బ్రిడ్జి కూలిపోయిన సమయంలో కొందరు బ్రిడ్జి కేబుల్‌పై వేలాడుతూ కనిపించారు. నదిలోని లోతులేని ప్రాంతాల్లో చాలా మంది నడుము లోతు నీటిలో మునిగిపోయారు. నదిలో పడిపోయినవారిలో కొందరు ఇతరులను కాపాడిన దృశ్యాలు కనిపించాయి. బాధితులు సహాయం కోసం చేసిన ఆర్తనాదాలు వినిపించాయి. ఇటీవల మరమ్మతులకు నోచుకున్న ఈ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం అధిక సంఖ్యలో సందర్శకుల తాకిడితో బరువును తట్టుకోలేక కుప్పకూలిపోయిందని అధికారులు తెలిపారు. '' బ్రిడ్జి కూలిపోవటంతో చాలా మంది సందర్శకులు నదిలో పడిపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అనేక మంది గాయాలపాలైనట్టు వార్తలు వస్తున్నాయి. వారిని ఆస్పత్రులకు తరలించాం'' అని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి బ్రిజేశ్ మేర్జా అన్నారు. 70 మంది వరకు మృతి చెందారని చెప్పారు.
ఈ ప్రమాదంపై భారత ప్రధాని మోడీ గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఇతర అధికారులతో మాట్లాడారు. సహాయక బృందాలను వెంటనే మోహరించాలనీ, పరిస్థితిని దగ్గరగా, నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. బాధితుల కోసం వీలైనంతవరకు సహాయం అందించాలని సీఎంకు తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆయన గుజరాత్‌లోనే ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మోడీ రూ. 2 లక్షల ఎక్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ. 50వేల ప్రకటించారు. ఈ ఘటనపై ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ హిందీలో ట్వీట్ చేశారు.
దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యుల కమిటీ
కాగా, మృతుల సంఖ్యపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారమూ వెల్లడించలేదు. ప్రమాద ఘటనపై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ రాజ్‌కుమార్ బేణివాల్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో సహాయక చర్యలను పర్యవేక్షించటానికి సీఎం భూపేందద్ర పటేల్‌తో సహా ఇతర మంత్రులు మోర్బీకి తరలారు.
ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండానే రీఓపెన్
మని మందిర్ దగ్గర మచ్చూ నదిమీద నిర్మించిన ప్రసిద్ధమైన సస్పెన్షన్ బ్రిడ్జిని ఐదు రోజుల క్రితమే పున:ప్రారంభించారు. మరమ్మతుల కోసం ఆరు నెలల పాటు ఈ బ్రిడ్జిని మూసివేశారు. మరమ్మతులకు దాదాపు రూ. 2 కోట్లను ఖర్చు చేశారు. అయితే, ఈ బ్రిడ్జ్‌కు ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండానే రీఓపెన్ చేసినట్టు తెలుస్తున్నది. ఒక ప్రయివేటు ట్రస్టు ఈ బ్రిడ్జి మరమ్మతు పనులు నిర్వహించిందనీ, ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించకుండానే బ్రిడ్జి ప్రారంభమైందని మోర్బీ మునిసిపాలిటీ అధికారులు తెలపటం గమనార్హం.
బ్రిడ్జి చరిత్ర
ఈ బ్రిడ్జికి 140 ఏండ్ల చరిత్ర ఉన్నది. బ్రిటీషుకాలంలో దీనిని నిర్మించారు. 1879, ఫిబ్రవరి 20న దీనిని అప్పటి ముంబయి గవర్నర్ రిచర్డ్ టెంపుల్ ఆవిష్కరించారు. బ్రిడ్జి నిర్మాణం 1880లో పూర్తయ్యింది. దీనికి మొత్తం రూ. 3.5 లక్షల వరకు ఖర్చయ్యింది. నిర్మాణానికి అవసరమైన సామాగ్రి అంతా ఇంగ్లాండ్ నుంచే వచ్చింది. దర్బార్గర్ నుంచి నజర్బాఫ్ుకు కలిపేందుకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. ప్రస్తుతం ఈ వేలాడే వంతెన మహాప్రభుజీని, మొత్తం సమకంత ప్రాంతాన్ని కలుపుతుంది. ఈ బ్రిడ్జి పొడవు దాదాపు 765 ఫీట్లు.