Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరళీకృత పన్నులు..వంద శాతం ఎఫ్‌డీఐలు
- రక్షణ మొదలు అంతరిక్షం వరకూ అవకాశాలు
- వడోదర సభలో ప్రధాని మోడీ
అహ్మదాబాద్ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్పొరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు చేస్తున్న మేళ్లను, కల్పిస్తున్న అవకాశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు పునరుద్ఘాటించారు. గుజరాత్‌లోని వడోదరలో టాటా-ఎయిర్‌బస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న సి-295 రవాణా విమానాల తయారీ సదుపాయాల కేంద్రానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మోడీ ప్రసంగిస్తూ కార్పొరేట్ సంస్థలకు బీజేపీ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరుస్తున్నట్టు వైనాన్ని ఆయన వివరించారు. తక్కువ తయారీ వ్యయంతో అత్యధిక లాభాలను ఆర్జించే అవకాశాలను కల్పించడమే తమ ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. ప్రపంచ పోటీకి అనుగుణంగా కార్పొరేట్ పన్నుల విధానాన్ని సరళీకృతం చేశామని, నూటికి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచామని ఆయన ప్రకటించారు. రక్షణ రంగం మొదలుకొని అంతరిక్ష పరిశోధన రంగం వరకూ అన్నింటా ప్రయివేటు సంస్థలకు ప్రాధాన్యతనిస్తూ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. భారత్‌లో నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని చెబుతూ ప్రయివేటు కంపెనీలకు ఏమాత్రం ఇబ్బందులు కలగనీయకుండా ఉండేందుకు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగే నాలుగు లేబర్ కోడ్లను తీసుకొస్తున్నామని తెలిపారు. డజన్ల కొద్ది ఉన్న పన్నుల సంక్లిష్ట విధానాలకు తెరదించి వస్తుసేవల పన్ను (జిఎస్టి) అమల్జేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో ఆర్థిక సంస్కరణల్లో కొత్త శకం నడుస్తోందన్నారు. దీని వలన రాష్ట్రాలతో కేంద్రం కూడా ప్రయోజనం పొందుతుందన్నారు. రవాణా విమానాల తయారీ కేంద్రాన్ని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టిఎఎస్ఎల్), ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ ఏర్పాటు చేయనున్నాయి. ఈ సందర్భంగా మోడీ మట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రభుత్వ రంగానికి, ప్రైవేటు రంగానికి సమానా ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. తాత్కాలిక నిర్ణయాన్ని తీసుకునే విధానాన్ని విడిచిపెట్టి, పెట్టుబడిదారులకు అనేక కొత్త ప్రోత్సహకాలను అందిస్తున్నామన్నారు.