Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: తనను తిట్టిన బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మకు ఢిల్లీ జల సంఘం అధికారి కౌంటర్ ఇచ్చారు. శుభ్రత కోసం రసాయనాలు చల్లిన యమునా నది నీటితో తల స్నానం చేశారు. ఛత్ పూజ సందర్భంగా భక్తులు నదిలో స్నానమాచరించడం సురక్షితమేనని నిరూపించారు. ఛత్ పూజా ఏర్పాట్ల నేపథ్యంలో ఢిల్లీ జల్ బోర్డ్ (డీజేబీ) అధికారులు యమునా ఘాట్‌ను రసాయనాలతో శుభ్రం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ పశ్చిమ ఎంపీ పర్వేష్ వర్మ అక్కడకు చేరుకున్నారు. ఘాట్‌ను శుభ్రం చేయిస్తున్న అధికారులతో వాదనకు దిగారు. ఎనిమిదేండ్ల వరకు యమునా నది శుభ్రం గురించి పట్టించుకోలేదని పర్వేష్ వర్మ ఆరోపించారు. ఇప్పుడు హడావుడిగా రసాయనాలు చల్లుతున్నారని విమర్శించారు. 'ఈ నీటిలో మొదట మీరు మునగండి' అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కెమికల్స్‌ను మీ తలపై పోయమంటారా? మీకు సిగ్గు లేదా? అంటూ వారిని దుర్భాషలాడారు. ఎంపీ పర్వేష్ వర్మ విసిరిన చాలెంజ్‌ను ఢిల్లీ జల సంఘం (డీజేబీ) నాణ్యత నియంత్రణ అధికారి సంజరు శర్మ స్వీకరించారు. రసాయనాలతో శుభ్రం చేసిన యమునా నది నీటితో ఆయన స్నానం చేశారు. ఆ నీటిలో స్నానం చేయవచ్చని భక్తులకు భరోసా ఇచ్చారు.