Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం ధర్మాసనం ఆగ్రహం
న్యూఢిల్లీ : లైంగిక వేధింపులు, దాడి బాధితులకు 'రెండు వేళ్ల (టూ ఫింగర్స్)' పరీక్ష నిర్వహించడం తగదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆ రకంగా చేస్తే వారిని మరింత బాధించడమే అవుతుందని పేర్కొంది. సమాజం ఇంత పురోగతి, అభివృద్ధి చెందాక... కూడా రెండు వేళ్ల పరీక్ష నిర్వహించడం విచారకరమని తెలిపింది. ఎలాంటి శాస్త్రీయత లేని ఆ తరహా పరీక్షను నిషేధించిన తరువాత కూడా ఆ విధంగా పరీక్షలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం జార్ఖడ్ వర్సెస్ శైలేంద్ర కుమార్ కేసును జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. 'రెండు వేళ్ల' పరీక్ష నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. లైంగిక వేధింపులకు గురైన వారిని పరీక్షించడానికి తగిన విధానాన్ని కమ్యునికేట్ చేయడానికి వైద్యులకు వర్క్‌షాప్‌లు నిర్వహించాలని ఆదేశించింది. ఈ తరహా కేసుసల్లో మహిళ సాక్ష్యం ఆమె లైంగిక చరిత్రపై ఆధారపడి ఉండదని, కేవలం లైంగికంగా చురుకుగా ఉన్నందున ఆమె తనపై అత్యాచారం జరిగిందని చెపితే నమ్మబోమని చెప్పడం పితృస్వామ్యంగా వ్యవస్థకు చిహ్నంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. లైంగిక వేధింపులు, దాడి బాధితులకు ఈ పరీక్ష నిర్వహించడం వారికి బాధాకరమేనని పేర్కొంది. 'రెండు వేళ్ల' పరీక్ష నిలిపివేయమని కోర్టు పదేపదే చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. లైంగికంగా చురుకుగా ఉన్న మహిళపై లైంగికదాడి జరగదన్న అపోహతోనే ఈ తరహా పరీక్ష నిర్వహిస్తున్నారని, ఇందులో నిజం ఉండదని తీర్పులో పేర్కొంది. లైంగిక వేధింపులు, లైంగికదాడి బాధితులను పరీక్షించే సమయంలో అనుసరించాల్సిన విధానాల్లో రెండు వేళ్ల పరీక్ష సూచించకుండా వైద్య పాఠ్యాంశాలను సమీక్షించాలని ఆదేశించింది. 'రెండు వేళ్ల' పరీక్ష నిర్వహించడం విచారకరమని వ్యాఖ్యానించిన ధర్మాసనం ట్రయల్ కోర్టు నమోదు చేసిన శిక్షను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.