Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్టాల్ని దుర్వినియోగం చేస్తూ జైలు శిక్షలు : ఐరాస చీఫ్ గుటెర్రస్
- వారి రక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు, అంతర్జాతీయ సమాజానికి పిలుపు
న్యూఢిల్లీ : ఈ ఏడాది 70మందికిపైగా జర్నలిస్టులు హత్యకు గురయ్యారని, చట్టాలను దుర్వినియోగం చేస్తూ రికార్డ్ స్థాయిలో మీడియా ప్రముఖుల్ని వివిధ దేశాల్లో ప్రభుత్వాలు ఖైదు చేశాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హత్యలు, జైలు శిక్ష, హింస, చంపేస్తామని బెదిరింపులు పెరుగుతున్నాయని, దీనిపై ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. జర్నలిస్టుల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. జర్నలిస్టులపై నేరాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవమైన నవంబర్ 2ను పురస్కరించుకొని ఆయన ఈ పై వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో పాలకుల వ్యతిరేకంగా గళాన్ని విప్పుతున్న జర్నలిస్టులను మోడీ సర్కార్ వివిధ చట్టాల కింద అరెస్టు చేసి జైల్లో నిర్బంధిస్తోంది. ఎన్ఫోర్స్మేంట్ డైరెక్టరేట్‌తో మీడియా కార్యాలయాలపై దాడులు జరుపుతోంది. జర్నలిస్టు సిద్దికీ కప్పన్‌ను జైల్లో నిర్బంధించింది. మహ్మద్ జుబేర్‌ను అరెస్టు చేస్తే..సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ మంజూరుచేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఈ ధోరణిపై గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. ''ప్రజస్వామ్యం బలంగా పనిచేయాలంటే మీడియా స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడం, పాలనలో తప్పులను బహిర్గతం చేయటంలో మీడియాది విశేషమైన పాత్ర. అయితే జర్నలిస్టులపై నేరాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది 70మందికిపైగా హత్యకు గురయ్యారు. బెదిరింపులు పెరిగాయి. ముఖ్యంగా మహిళా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకొని ఆన్లైన్ బెదిరింపులు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మీడియాకు సంకెళ్లు వేయాలన్న ప్రయత్నం సాగుతోంది. ఇదంతా కూడా కొన్ని చట్టాలతో ప్రభుత్వాలు, ఆర్థిక, ఇతర మార్గాల్లో అమలుజేస్తున్నాయి. ఈ పోకడలు జర్నలిస్టులను మాత్రమే కాకుండా, మొత్తం సమజాన్నే బెదిరిస్తున్నాయి'' అని గుటెర్రస్ ఆవేదన వ్యక్తం చేశారు.