Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాత్యహంకారం, కుల వివక్ష, అసహనంపై ఏర్పాటైన ప్రతినిధి బృందంలో చోటు
న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో మొదటిసారిగా ఓ దళిత యువతికి చోటు దక్కింది. జాత్యహంకారం, వివక్ష, అసహనం, విద్వేషం..తదితర అంశాలపై ఐరాస ఏర్పాటుచేసిన ప్రతినిధి బృందంలో భారత్‌కు చెందిన అశ్విని కె.పి స్పెషల్ రిపోర్టర్‌గా నియమితులయ్యారు. ఐరాస మానవ హక్కుల మండలి 51వ సమావేశాలు నవం బర్లో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భం గా ఆయా అంశాలపై జరిగే సమావేశాల్లో ప్రతినిధుల కు పలు నివేదికలు అందజేసే బాధ్యతలు నిర్వర్తించను న్నారు. ఈ సందర్భంగా ఆన్లైన్ న్యూస్ వెబ్ పోర్టల్ 'ద లీఫ్లెట్'కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన నేపథ్యం, చదువు..తదితర విషయాలు పంచుకున్నారు.
జేఎన్‌యూ నుంచి పీహెచ్డీ
కర్నాటకలోని కోలార్ జిల్లా నుంచి వచ్చాను. అయితే ప్రాథమిక, ఉన్నత విద్య అనేక చోట్ల సాగింది. జేఎన్‌యూ నుంచి ఎం.ఫీల్, పీహెచ్డీ పూర్తిచేశాను. మా కుటుంబానికి 'అంబేద్కర్ ఆలోచనల' పట్ల ఎనలేని గౌరవం. దాంతో చిన్న వయసు నుంచే నాకు దళిత, ఇతర అభ్యుదయ ఉద్యమాల పట్ల అవగాహన ఏర్పడింది. పీహెచ్డీ థీసిస్‌లో భాగంగా అట్టడుగు సంస్థలతో కలిసి పనిచేశాను. ఇదంతా కూడా అకడమిక్, ఫీల్డ్ అనుభవాన్ని పొందటంలో ఎంతో దోహదం చేశాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌లో సీనియర్ క్యాంపెయినర్‌గా పనిచేశాను.
సమాజంలో వివక్ష
పట్టణ ప్రాంతాల్లో కుల వివక్ష, లింగ వివక్ష అత్యంత సూక్ష్మంగా విస్తరించి ఉంది. వీటికి వ్యతిరేకంగా గళం విప్పినందుకు శత్రుత్వాన్ని ఎదుర్కొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భారత్‌లో ఒక దళితురాలిగా, స్త్రీగా ఎప్పుడూ వివక్షకు గురవుతూ వచ్చాను. ఉన్నత కుటుంబం, మంచి విద్యా సంస్థలో చదువు ఉన్నప్పటికీ..సమాజంలో వివక్షను ఎదుర్కొన్నాను. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో స్పెషల్ రిపోర్టర్‌గా ఉండటం గొప్ప అవకాశం. ప్రపంచ వేదికపై నా అనుభవాన్ని పంచుకుంటాను. అట్టడుగున ఉన్న మహిళల ప్రాతినిథ్యం, ఉనికి ప్రముఖ స్థానాల్లో పెరగడానికి ఇది దోహదం చేస్తుందని నమ్ముతున్నా.