Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంబేలెత్తిస్తున్న కూరగాయల ధరలు
- కోవిడ్ తర్వాత ఆహారంపై 76శాతం పెరిగిన కుటుంబాల ఖర్చు : లోకల్ సర్కిల్ సర్వే
- రిటైల్ ద్రవ్యోల్బణం కారణంగా 50శాతం ఆహార ధరలు పైకి
న్యూఢిల్లీ : కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వస్తున్న ఆదాయానికి ఖర్చులకు పొంతన కుదరటం లేదు. దేనిని తగ్గించుకుంటే అవసరాలు తీరుతాయా? అని సామాన్యుడు ఇంటి బడ్జెట్ లెక్కలతో సతమతమవుతున్నాడు. గత రెండేండ్లలో ప్రతి కుటుంబం నెలవారీ ఖర్చులు అనూహ్యంగా పెరిగాయని, 76శాతం కుటుంబాల కూరగాయలపై నెలవారీ ఖర్చు 25 నుంచి 100శాతం వరకు పెరిగిందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్..'లోకల్ సర్కిల్స్' వెల్లడించింది. ''కూరగాయ పంటలు స్థానికంగా లేకపోతే, రవాణా ఖర్చులు భారీ ఎత్తున పడుతున్నాయి. పొలం నుండి మార్కెట్కు రవాణా చేయాల్సిన దూరాన్ని బట్టి కూరగాయల ధరలు మారుతూ ఉంటాయి. కొనుగోలుదారులు ఎక్కడున్నారు? ఎంతమంది ఉన్నారు? అన్నది ఉత్పత్తిని, ధరను ప్రభావితం చేస్తోంది'' అని లోకల్ సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా వివరించారు.
సర్వేలో పాల్గొన్న వారు ఇచ్చిన సమాచారం ప్రకారం, కిలో టమాటాను రూ.60 లేదా అంతకంటే ఎక్కువ, ఉల్లిపాయలు రూ.35 లేదా అంతకంటే ఎక్కువ, బంగాళాదుంపలు రూ.30 లేదా అంతకంటే ఎక్కువ ధరకు 27శాతం మంది కొనుగోలు చేశారు. సర్వేలో 12,563 మంది పాల్గొనగా, 50శాతం కుటుంబాలు ఈ సంవత్సరంలో కిలో టమోటాకు రూ.50 కంటే ఎక్కువ చెల్లించారని తేలింది.
ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి చేరుకోవటమూ ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఆహార ధరల పెరుగుదల స్పష్టంగా కనపడుతోంది. జాతీయ గణాంక కార్యాలయం అక్టోబర్లో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, సెప్టెంబర్లో ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టస్థాయి 7.41శాతానికి చేరింది. ఆహార ధరలు 50శాతం పెరగడానికి రిటైల్ ద్రవ్యోల్బణం కారణమైంది. ఆగస్టులో 7.62శాతం ఉండగా, సెప్టెంబర్లో 8.6శాతానికి చేరుకుంది.