Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేల కొనుగోళ్లే సాక్ష్యం
- రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్ల జోక్యం
- మంత్రులను తొలగించే అధికారం వారికి లేదు
- హిందీ రుద్దడం రాజ్యాంగ వ్యతిరేకం
- 22 భాషలనూ సమానంగా ప్రోత్సహించాలి: ఏచూరి
న్యూఢిల్లీ: బీజేపీ ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తోందనీ, అందులో భాగంగానే తెలంగాణలో ఎమ్మెల్యేల కోనుగోళ్ళు వ్యవహారం జరిగిందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోళ్లను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. మంగళవారం నాడిక్కడ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం (ఏకేజీ భవన్)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీతారాం ఏచూరి మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిపోయినా అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు కుట్ర పన్నుతోందనీ, అందులో భాగంగానే గోవా, కర్నా టక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో చేసిందని విమర్శించారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే చేస్తోందని ధ్వజమెత్తారు. దీని కోసం కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేయడం, లేకపోతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం చాలా దారుణమనీ, దౌర్భగ్యకరమని అన్నారు. ఎమ్మెల్యేలకు ఇస్తామన్న మొత్తం ప్రకటించారనీ, అది వాస్తవమా? కాదా? తెలియదని అన్నారు. కానీ బీజేపీ వెళ్లే విధానం చూస్తే, దేశంలోని ప్రజాస్వామ్యానికి ప్రమాదమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్ల జోక్యం రాజ్యాంగ వ్యతిరేకమనీ, మంత్రులను, వైస్ చాన్సులర్లను తొలగించే అధికారం లేదని గవర్నర్లకు లేదని పేర్కొన్నారు. బీజేపీయేతర రాష్ట్రాలపై గవర్నర్ల పెత్తనం, కేంద్రం, రాష్ట్ర మధ్య సంబంధాలు, సమాఖ్య వ్యవస్థను కాపాడేందుకు భావసారుప్యత పార్టీలతో చర్చలు జరుపుతున్నామని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఐక్యంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సుప్రియా సులేలతో మాట్లాడామని తెలిపారు. వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీ, ఆప్తో సహా అన్ని బీజేపీయేతర పార్టీలతో చర్చిస్తామని అన్నారు. బీఆర్ఎస్లానే జాతీయ స్థాయిలో అనేక పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయనీ, ఆయా పార్టీల లక్ష్యం నెరవేరుతోందనీ, ఆయా పార్టీల ఉద్దేశం విజయవంతం అవుతోందన్నారు. గతంలో బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వేను ప్రధాని మోడీ ప్రారంభించిన ఐదు రోజులకే కూలిపోయిందని, గుజరాత్లో బ్రిడ్జి కూలిపోవడంపై వాస్తవాలు బయటకు రావాలని అన్నారు. బ్రిడ్జి ఆధునీకరణకు కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థ అర్హతలు, అలాగే బ్రిడ్జి సామర్థ్యం వంటి అంశాలు బయటకు రావాలని అన్నారు. హిందీని రుద్దడంపై తమ పార్టీ వ్యతిరేకిస్తోందనీ, రాజ్యాంగంలోని 22 భాషలకు సమాన ప్రోత్సాహం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యా సంస్థల్లో హిందీ భాష పెట్టడాన్ని ఖండిస్తోన్నామనీ, ఇది రాజ్యాంగంలోని ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధమని అన్నారు.