Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేరొక ధర్మాసనానికి ఏపీ రాజధాని పిటిషన్లు
న్యూఢిల్లీ: ఏపీ రాజధాని అమరావతి అంశంపై దాఖలైన వేర్వేరు పిటిషన్ల విచారణ నుంచి సీజేఐ జస్టిస్ యుయు లలిత్ తప్పుకున్నారు. తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నట్టు తెలిపారు. అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, మస్తాన్వలీలు, మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లు మంగళవారం సీజేఐ జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ముందుకు వచ్చాయి. రాజధాని రైతుల తరఫు న్యాయవాది సుందరం వాదనలు వినిపిస్తూ.. గతంలో జస్టిస్ యుయు లలిత్ సీనియర్ న్యాయవాదిగా ఉన్న సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అమరావతిపై అభిప్రాయం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే 30 అభిప్రాయాన్ని ఇచ్చిన కాపీని సీజేఐకు అందజేశారు. ఆ కాపీని పరిశీలించిన సీజేఐ జస్టిస్ యుయు లలిత్ ఈ పిటిషన్లను తాను విచారించనని తెలిపారు. అమరావతిపై అభిప్రాయం ఇచ్చిన విషయం తనకు గుర్తుకు రాలేదనీ, ఈ నేపథ్యంలో తాను ఈ పిటిషన్లపై విచారణ నుంచి వైదొలుగుతున్నట్టు పేర్కొన్నారు. తాను సభ్యుడిగా లేని ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణ తేదీ తెలపాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వైద్యనాథన్ కోరగా... తాను విచారించని అంశంపై తేదీ నిర్ణయించడం సబబు కాదని రిజిస్ట్రీ ఖరారు చేస్తుందని పేర్కొన్నారు.