Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభ్య దేశాల సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని వ్యాఖ్య
న్యూఢిల్లీ : అనుసంథాన ప్రాజెక్టులు సార్వభౌమాధికార అంశాలను గౌరవించాలని విదేశాంగ మంత్రి జై శంకర్ వ్యాఖ్యానించారు. చైనా చేపట్టిన బెల్డ్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బిఆర్ఐ) ను ప్రస్తావిస్తూ, మంగళవారం షాంఘై సహకార సంస్థ (ఎస్సిఓ) ప్రభుత్వాధినేతల వర్చువల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కి చెందిన పలు ప్రాంతాల నుండి ఈ బిఆర్ఐ సాగుతున్నందున జై శంకర్ ప్రధానంగా ఈ ప్రాజెక్టు గురించే ప్రస్తావించారు. అనుసంథాన ప్రాజెక్టులేవైనా సభ్య దేశాల సార్వభౌమాధికార హక్కులను, ప్రాదేశిక సమగ్రతను, అంతర్జాతీయ చట్టాలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. బిఆర్‌ఐలో చేరేందుకు భారత్ తిరస్కరించింది. ఇరాన్‌కి చెందిన చాబర్ ఓడరేవు నుండి, అలాగే సెంట్రల్ ఆసియా దేశాల నుండి ద్వైపాక్షిక వాణిజ్యం మెరుగుపడేందుకు ఉద్దేశించిన, భారత భాగస్వామిగా వున్న ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్స్ (ఐఎన్ఎస్టిసి) నుండి మరింత వాణిజ్యం జరగాలని జై శంకర్ కోరారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్‌కు తమ మద్దతును భారత్ మినహా మిగిలిన దేశాలన్నీ ప్రకటించాయి. ఈ మేరకు సమావేశం అనంతరం సంయుక్త ప్రకటన జారీ చేశారు. యురాసియన్ ఎకనామిక్ యూనియన్ నిర్మాణంతో కలిసి బెల్డ్ అండ్ రోడ్ నిర్మాణాన్ని సాగించేందుకు కృషి చేయాలని ఆ ప్రకటన కోరింది. ఎస్సిఓ సభ్య దేశాలతో భారత్ వాణిజ్యం కేవలం 14100కోట్ల డాలర్లుగానే వుందని, ఇది ఇంకా మరిన్ని రెట్లు పెరిగేందుకు అవకాశాలు వున్నాయని జైశంకర్ పేర్కొన్నారు. మన పరస్పర ప్రయోజనాలకు, మరింత ముందుకు వెళ్లడానికి గల ఏకైక మార్గం ఎలాంటి అరమరికలు లేని మార్కెట్ సౌలభ్యమేనని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో పాక్ విదేశాంగ మంత్రి బిల్వాల్ భుట్టో జర్దారి, రష్యా ప్రధాని మిఖైల్ మిషుస్తిన్, కజకస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ప్రధానులు పాల్గొన్నారు. ఎస్సిఓ దేశాల్లో చైనాతోనే భారత్ వాణిజ్యం అధికంగా ఏడాదికి వంద బిలియిన్ల డాలర్ల వరకు జరుగుతోంది. రష్యాతో వాణిజ్యం 20బిలయన్ల డాలర్ల కన్నా తక్కువగానే వుంది.