Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిరస్కరించిన సుప్రీంకోర్టు
- ఆర్టికల్ 32 ప్రకారం పరిగణించలేమని వ్యాఖ్య
న్యూఢిల్లీ : ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లపై పార్టీ గుర్తులను ముద్రించకుండా నిలిపివేసేలా దాఖలు అయిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికల్లో ఈవీఎం, బ్యాలెట్ పేపర్‌పై పార్టీ గుర్తులు ముద్రించకుండా, దానికి బదులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేరు, వయస్సు, విద్యార్హత, ఫోటోతో ముద్రించేలా కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యారు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సీజేఐ జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. ఈ కేసును రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం పరిగణించలేమని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ రాజకీయ పార్టీలు, శాసన సభా పక్షాలను గుర్తిస్తుందని తెలిపారు. ''అభ్యర్థికి మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీతో ఎన్నికలు సమగ్రంగా అనుసంధానించబడి ఉంటాయి. అలా కాకపోతే ఎన్నికైన తరువాత వ్యక్తి మరొక పార్టీలో చేరే అవకాశం ఉంది'' అని తెలిపింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్, గోపాల్ శంకరనారాయణ్ వాదిస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 21లను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈవీఎంలపై పార్టీ గుర్తులను ముద్రించడం ఓటర్ల ఎంపికను ప్రభావితం చేస్తుందనీ, ఎన్నికల అభ్యర్థుల విశ్వసనీయత ఆధారంగా ఎన్నుకునే అవకాశాన్ని కోల్పోతుందని పేర్కొన్నారు. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్ వ్యతిరేకించారు. ఓటరు ఈవీఎంలో ఓటు వేయడానికి ముందే, ఓటర్లు తమ అభ్యర్థిని ఎన్నుకుంటారని పేర్కొన్నారు. అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలను ముందుగా వెల్లడిస్తారని తెలిపారు. ఈ విషయంలో పిటిషనర్ అభ్యర్థనను సంబంధిత అధికార యంత్రాంగం పరిశీలిస్తుందని, ప్రతివాదుల సమర్పణను నమోదు చేస్తూ ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది.