Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖండించిన జర్నలిస్టుల సంఘం
న్యూఢిల్లీ : 'వైర్' మీడియా సంస్థ, ఎడిటర్ నివాసాలపై ఢిల్లీ పోలీసులు సోదాలు చేపట్టటాన్ని జర్నలిస్టుల సంఘం, ప్రతిపక్షాలు ఖండించాయి. వైర్ వ్యవస్థాపక సంపాదకులు సిద్దార్థ్ వరదరాజన్, ఎం.కె. వేణు, సిద్దార్థ్ భాటియా, డిప్యూటీ ఎడిటర్ జాహ్నవి సేన్, ఢిల్లీ-ముంబయి ప్రొడక్ట్ కమ్ బిజినెస్ హెడ్ మిథున్ కిదాంబి నివాసాలపై సోమవారం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోదాలు జరిపారు. అధికార బీజేపీ ప్రతినిధి అమిత్ మాలవియా దురుద్దేశపూర్వకంగా చేసిన ఫిర్యాదు మేరకు ఈ సోదాలు జరిపారనీ, వారిపై జారీ చేసిన సెక్షన్ 91 నోటీసు ప్రకారం వివిధ పరికరాలను స్వాధీనం చేసుకున్నారని జర్నలిస్టు సంఘాలు తెలిపాయి.
ఢిల్లీలోని భగత్ సింగ్ నగర్లో ఉన్న వైర్ కార్యాలయంలో కూడా సోదాలు జరిపి, పలు పరికరాలను స్వాధీనం చేసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కార్యాలయం నుంచి వైర్‌కి చెందిన న్యాయవాదిని పోలీసులు బలవంతంగా బయటికి నెట్టినట్టు పేర్కొన్నాయి. స్వాధీనం చేసుకున్న పరికరాలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని వైర్ ఓ ప్రకటనలో పేర్కొంది. వైర్ సంస్థ వద్ద ఉన్న రహస్య, సున్నితమైన సమాచారాన్ని స్వాధీనం చేసుకునేం దుకు, తప్పుడు సమాచారంగా చూపేందుకు సాకుగా వినియోగించవచ్చని వెల్లడించింది. ఆఫీస్ వ్యవహారాలకు సంబంధించిన ఆ పరికరాల కాపీలు కూడా అందించలేదని తెలిపింది.వైర్‌తో పాటు 11 డిజిటల్ వార్తా సంస్థలను కలిగి ఉన్న డీఐజీఐపీయూబీ న్యూస్ ఇండియా ఫౌండేషన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. పోలీసుల సోదాలు ద్వేషపూరిత ఉద్దేశాలకు చెంపపెట్టు అని పేర్కొంది. నకిలీ వార్తను ప్రచురించే జర్నలిస్టు లేదా మీడియా సంస్థ.. సహచరులకు, సమాజానికి జవాబుదారీగా ఉండాలని తెలిపింది. పోలీసులు సోదాలు చేపట్టడంతో మీడియా వద్ద ఉన్న రహస్య, సున్నితమైన సమాచారాన్ని స్వాధీనం చేసుకోవడానికి, తప్పుడు వార్తగా మలచడానికి ఈ సోదాలు ఓ సాకుగా వినియోగించే ప్రమాదాన్ని తోసిపుచ్చలేమని పేర్కొంది. ఏ న్యాయమైన విచారణ అయినా చట్టాలకు లోబడి ఉండాలి కానీ.. జర్నలిజాన్ని నేరపూరితం చేయాలనే ఉద్దేశంతో ఉండకూడదని సూచించింది. పోలీసుల విచారణ, వేధింపులు జర్నలిస్టులను వారి విధులు చేయకుండా బెదిరింపులకు గురిచేశాయని ఇటీవల అనేక సందర్భాల్లో నిర్థారణైందని పేర్కొంది.