Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌లో ఆహార సంక్షోభ ప్రమాదం
- మోడీ సర్కార్ చెబుతున్న స్వయం సమృద్ధి అంతా డొల్ల
- జన్యుమార్పిడి విత్తనాలతో ఆవాల సాగుకు రంగం సిద్ధం
- అదే జరిగితే..వ్యవసాయరంగంపై కార్పొరేట్‌కు పట్టు : రాజకీయ విశ్లేషకులు
అనేక రంగాల్లో భారత్ స్వయం సమృద్ధి సాధిస్తోందంటూనే...మోడీ సర్కార్ విదేశాల నుంచి పెద్ద మొత్తంలో వంట నూనెలను దిగుమతి చేసుకుంటోంది. ఇందుకోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. ఇండోనేషియా నుంచి పామాయిల్, ఉక్రెయిన్ నుంచి సన్‌ఫ్లవర్ (పొద్దుతిరుగుడు), అర్జెంటీనా నుంచి సోయాబీన్ నూనె రాకపోతే..భారత్‌లో 140కోట్ల మంది ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. దేశీయంగా నూనె గింజల సాగు దెబ్బతినటం, రైతులను పట్టించుకోక పోవటమే ఈ పరిస్థితికి కారణమని వారు అన్నారు. అయితే ఈ సంక్షోభాన్ని సాకుగా చూపి..దేశీయంగా జన్యుమార్పిడి విత్తనాలతో ఆవాల సాగుకు కేంద్రం అనుమతి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసిందని సమాచారం.
న్యూఢిల్లీ : భారత విదేశీ నిల్వలు (డాలర్లలో ఉంటాయి) ఇటీవల భారీ మొత్తంలో కరిగిపోవడానికి ప్రధాన కారణం వంట నూనెల దిగుమతి. మనం వాడుతున్న పామాయిల్, సన్‌ఫ్లవర్, సోయాబీన్ నూనె..మొదలైనవి విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. ఆహార రంగంలో భారత్ స్వయం సమృద్ధి ప్రమాదంలో పడిందనటానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఒక అభివృద్ధి చెందుతున్న..140కోట్ల జనాభా ఉన్న దేశంగా..విదేశాలపై అతిగా ఆధారపడటం ప్రమాదకరమని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అనేక రంగాల్లో భారత్ స్వయం సమృద్ధి సాధిస్తోందని మోడీ సర్కార్ చేస్తున్న ప్రచారం ఉత్త డొల్లేనని వారు ఎద్దేవా చేస్తున్నారు. ప్రపంచమంతా ఇప్పుడు తీవ్రమైన మాంద్యంలో కూరుకుపోయింది. ఇలాంటి సమయంలో ఏ దేశమైనా విదేశీ మారక నిల్వల్ని ఖర్చు చేస్తుందా? అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నూనె గింజల సాగును ప్రోత్సహించకుండా, రైతుల సమస్యలు పరిష్కరించకుండా 'స్వయం సమృద్ధి' ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్న ఉదయిస్తోంది.
వ్యవసాయ పరిశోధన పక్కకు..
అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు ఆహార భద్రత అత్యంత కీలకమైంది. దీనికి సంబంధించి సరైన విధానాన్ని ఎంచుకోవటంలో మోడీ సర్కార్ ఎప్పుడో గాడి తప్పిందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అనేక ఆహార ఉత్పత్తులు పెద్ద మొత్తంలో విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. వ్యవసాయంపై ప్రభుత్వ వ్యయానికి కోతలు విధించటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని విమర్శలున్నాయి. మోడీ సర్కార్ వచ్చాక ప్రభుత్వరంగంలో వ్యవసాయ పరిశోధనపై శ్రద్ధ తగ్గింది. స్వల్ప మొత్తంలో నిధులు విడుదల చేసినా మన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతాలు చేస్తారని, పరిశోధనల సహకారంతో నూనె గింజల దిగుబడిని పెంచుకోవచ్చునని సమాచారం. మోడీ సర్కార్ ఇదంతా వృధా ఖర్చుగా భావిస్తోంది. మరోవైపు ఈ సంక్షోభాన్ని సాకుగా చూపి..దేశంలోకి జన్యుమార్పిడి పంటల సాగుకు రంగం సిద్ధం చేస్తోంది.
జన్యుమార్పిడి విత్తనాలకు ఓకే
జన్యుమార్పిడి ఆవాల సాగుకు మోడీ సర్కార్ ఇటీవలే పర్యావరణ అనుమతులు ఇచ్చేసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ 2025కల్లా జన్యుమార్పిడి ఆవాల సాగు రైతులు చేపట్టే అవకాశముంది. 'బిటి పత్తి విత్తనాల'కు వ్యతిరేకంగా రెండు దశాబ్దాల కిందట దేశమంతా నిరసనలు హోరెత్తాయి. ఈ తరహా విత్తనాల సాగుపై అనేక సందేహాలున్నాయి. పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. మానవులకు కొత్త కొత్త రోగాల్ని తెచ్చిపెడతాయని, ఎరువుల వాడకాన్ని విపరీతంగా పెంచుతుందని ఆందోళన వ్యక్తమైంది. ఆర్ఎస్ఎస్కు చెందిన 'స్వదేశీ జాగరణ్ మంచ్' నిరసనల్లో పాల్గొంది. జన్యుమార్పిడి చేసిన ఆవాల సాగుకు అనుమతిస్తే, భారత ఆహారభద్రత మల్టీనేషనల్ కంపెనీల చేతుల్లోకి వెళ్తుందని గట్టిగా వాదించింది. మరోవైపు వారి (బీజేపీ) నాయకులు దేశంలో జన్యుమార్పిడి ఆవాల సాగుకు అనుమతులు మంజూరు చేస్తున్నారు.
ఆరోగ్యానికి ముప్పు తప్పదు..
మనదేశంలో దక్షిణాదిన (కేరళ, తమిళనాడు, కర్నాటక) వంటనూనెగా కొబ్బరినూనెను ఎక్కువగా వాడుతున్నారు. దేశ ఉత్తర వాయువ్యంలో పల్లినూనెను ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇక తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడి ప్రజలు తమ వంటకాల్లో ఆవ నూనెను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల ఆహార అవసరాలు ఎక్కువగా స్థానిక పంటల సాగుతో భర్తీ అయ్యేవి. గత 25ఏండ్లలో ఇదంతా అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా నూనె గింజల సాగు మెల్ల మెల్లగా పడిపోతూ వస్తోంది. ప్రస్తుతం మనదేశం వంట నూనె అవసరాల్లో 70శాతం దిగుమతులతో తీరుతోంది. ధరలు రెట్టింపు అయ్యాయి. ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు అదానీ వ్యాపారం లక్షల కోట్లకు విస్తరించింది. 'వంట నూనెల' విభాగంలో అతిపెద్ద బ్రాండ్‌గా ఎదిగింది. ప్రమాదకర రసాయానాలతో వంటనూనెలను రిఫైన్ చేస్తున్నా...పాలకులు పట్టించుకోవటం లేదు. ఆవ నూనె, పల్లి నూనె, కొబ్బని నూనెల వినియోగం పడిపోవటానికి 'రిఫైన్డ్ వంటనూనె' వాడకం పెరగటమూ ఒక కారణం.