Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలిసి రండి ..అన్ని రాజకీయ పక్షాలకు డీఎంకే లేఖ
చెన్నై : బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్ల తీరు వివాదస్పదమవుతోంది. మొన్న కేరళ గవర్నర్..ఇపుడు తమిళనాడు గవర్నర్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయ అట్టుకుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కవ్వించేలా గవర్నర్లను ఉసిగొల్పుతోంది. తాజాగా తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవిని తక్షణమే తొలగించాలని కోరుతూ భారత రాష్ట్రపతికి పంపే మెమోరాండంపై సంతకాలు చేయాల్సిందిగా అన్ని పార్టీలకు చెందిన భావసారూప్య ఎంపీలను డీఎంకే కోరింది. ఈ మేరకు పార్లమెంట్లో డీఎంకే నేత టి.ఆర్బాలు అన్ని రాజకీయ పార్టీలకు ఒక లేఖ రాశారు. గురువారం నాటికల్లా ఈ లేఖపై సంతకాలు చేయాల్సిందిగా కోరారు. ఇతర పార్టీలేవీ ఇంకా నిర్ణయించలేదు. ప్రతీ దేశం ఏదో ఒక మతంపైనే ఆధారపడిందనీ, భారతదేశం అందుకు మినహాయింపేమీ కాదని ఇటీవల గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ 11 రాజకీయ పార్టీలు సంయుక్త ప్రకటన చేశాయి. అది జరిగిన రెండు రోజులకే ఎంపీలను కోరుతూ డీఎంకే ఈ లేఖ రాసింది.
గతేడాది సెప్టెంబరులో రవి తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి పలు విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణ పడుతూ, అనేక వివాదాల్లో మునిగి తేలుతున్నారు. ఫిబ్రవరిలో, నీట్ బిల్లును అసెంబ్లీ పున:పరిశీలించాలని కోరుతూ వెనక్కి తిప్పిపంపారు. నీట్‌కు హాజరు కాకుండా తమిళనాడు విద్యార్ధులకు మినహాయింపు ఇవ్వాలని ఆ బిల్లు కోరుతోంది. 12వ తరగతి ఫలితాలను ప్రాతిపదికగా తీసుకుని వైద్య కోర్సుల్లోకి విద్యార్ధుల ప్రవేశాన్ని అనుమతించాలని బిల్లు ప్రతిపాదించింది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధమైన పాత్రకే కట్టుబడిన గవర్నర్లనేవారు అంతరించిపోయిన జాతులుగా మారిపోయారని వ్యాఖ్యానించారు. 2014 నుంచి గవర్నర్లుగా నియమితులైన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రకంగా వివాదాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి న్యూఢిల్లీలో సోమవారం మాట్లాడుతూ, గవర్నర్ల చర్యలకు నిరసనగా సంయుక్త కార్యాచరణకు భావ సారూప్యత కలిగిన ప్రతిపక్షాలు కలిసి రావాలంటూ విజ్ఞప్తి చేశారు. పలువురు గవర్నర్ల చర్యలు రాజ్యాంగ, ప్రజాస్వామ్య విరుద్ధంగా వుంటున్నాయని విమర్శించారు. కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం కూడా వైస్ ఛాన్సలర్ల నియామకం విషయంలో అక్కడి గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌తో తీవ్రంగా పోరాడుతోంది, ఆర్థిక మంత్రి బాలగోపాల్ తొలగింపు డిమాండ్ పట్ల సీపీఐ(ఎం) నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో గవర్నర్ పదవినే రద్దు చేయాలని వామపక్షాలు కోరుతున్నాయి.