Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టుకు ఫోరెన్సిన్ నివేదిక
- మోర్బీ వంతెన మరమ్మతుల్లో అనేక లోపాలు, లొసుగులు
మోర్బి: అనేక అవకతవకల కారణంగానే గుజరాత్‌లోని మోర్బీలో తీగల వంతెన కూలిపోయిం దని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలియజేసింది. ఆదివారం వంతెన తెగిపడిన విషాద ఘటనలో 140 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలి సిందే. వంతెన మరమ్మతుల కాంట్రాక్టు చేసిన కంపెనీకి అసలు ఆ రంగంలో అనుభవమే లేదని వెల్లడైనట్టు పేర్కొంది. వంతెన గొలుసులు, తీగలు తుప్పు పట్టి వున్నాయనీ, వాటిని అసలు మార్చకుండా కేవలం వంతెన ఫ్లోరింగ్‌ను మాత్రం మార్చారని తెలిపింది. ఆ ఫ్లోరింగ్ బరువును కూడా వంతెన భరించలేకపోయిందని ఫోరెన్సిక్ నివేదికను ఉటంకిస్తూ ప్రాసిక్యూషన్ మంగళవారం కోర్టుకు వివరించింది. మరమ్మతుల పనులు చేపట్టడానికి ముందుగా 143 ఏండ్లనాటి ఈ వంతెనపై ఎలాంటి వ్యవస్థాగతమైన ఆడిట్ కూడా జరగలేదని తెలిపింది. పైగా ఈ పనులు చేపట్టిన వారికి ఎలాంటి నైపుణ్యాలు కూడా లేవని పేర్కొంది. మరమ్మతుల కోసం మూసివేసిన వంతెనను తిరిగి ప్రారంభించిన నాలుగు రోజులకే ఈ దుర్ఘటన సంభవించింది. ఇప్ప టి వరకు ఈ విషాద ఘటనలో 140మందికి పైగానే మరణించారు. మతులకు నివాళిగా గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా సంతాపదినాన్ని పాటించింది.
మెటీరియల్ అంతా నాసిరకమే
మరమ్మతుల కోసం ఉపయోగించిన మెటీరియల్ అంతా నాసిరకందేనని అధికారులు కోర్టుకు తెలిపారు. మొత్తంగా వంతెన అంతా చాలా ప్రమాదకరంగా వుందన్నారు. తీగలన్నీ చాలావరకు తుప్పు పట్టి వున్నాయని పేర్కొన్నారు. ఫ్లోరింగ్‌తో పాటు తీగలు కూడా మార్చినా లేదా మరమ్మతులు చేసినా ఈ ఘోరం జరిగి వుండేది కాదని అభిప్రాయ పడ్డారు. మరమ్మతుల పనులను కాంట్రాక్టుకు తీసుకున్న కాంట్రాక్టర్లు వాటిని సబ్ కాంట్రాక్టుకు ఇచ్చారని, వారు కేవలం రంగులు వేసి, పాలిష్ చేసి అప్పగించారని పేర్కొన్నారు. 2007లో కూడా ఇదే సంస్థకు కాంట్రాక్టునివ్వడం గమనార్హం. ఈ వంతెన పై ఎంతమందిని పంపవచ్చు, ఎంత బరువును మోస్తుందనే అంచనాలు కూడా లేకుండానే వంతెనను ప్రారంభించేశారు. పైగా దీన్ని తిరిగి ప్రారంభించడానికి ముందుగా ప్రభుత్వం అనుమతి కూడా తీసుకోలేదు. అత్యవసర సహాయక చర్యలు చేపట్టడానికి ఎలాంటి ప్రణాళిక లేదు. ప్రాణాలను రక్షించేందుకు ఎలాంటి పరికరాలు అక్కడ లేవు. అసలు ఈ మరమ్మతులకు సంబంధిం చి ఎలాంటి పత్రాలు లేవని, నిపుణుల తనిఖీలు లేవని కోర్టుకు అందజేసిన పత్రాలు పేర్కొన్నాయి. వంతెన మరమ్మతులు పూర్తి చేయడానికి డిసెంబరు వరకు గడువుందని, కానీ దీపావళి, గుజరాత్ నూతన సంవత్సరం వీటన్నింటి దష్ట్యా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారని భావించి ముందుగానే వంతెనను ప్రారంభించేశారని పేర్కొంది.
పోలీసు కస్టడీకి ఆ నలుగురు
అరెస్టు చేసిన నిందితుల్లో ఒరెవా గ్రూపునకు చెందిన ఇద్దరు మేనేజర్లు, మరమ్మతులు చేసిన ఇద్దరు సబ్ కాంట్రాక్టర్లను శనివారం వరకు పోలీసు కస్టడీకి పంపారు. ఈ మేరకు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎం.జె.ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. సెక్యూరిటీ గార్డులు, టికెట్ బుకింగ్ క్లర్కులతో సహా ఐదుగురిని జ్యుడీషియల్ కస్టడీకి పంపారని ప్రాసిక్యూటర్ పంచల్ తెలిపారు. మొత్తంగా తొమ్మిది మందిని ఈ కేసులో అరెస్టు చేశారు. కొత్త ఫ్లోరింగ్ బరువు కారణంగానే వంతెన ప్రధాన కేబుల్ తెగిపడిందని ఫోరెన్సిక్ నిపుణులు భావిస్తున్నారని పంచల్ కోర్టుకు తెలియజేశారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికను సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేశారు. నాలుగు పొరలుగా అల్యూమి నియం షీట్లను ఫ్లోరింగ్‌కు వేశారని, దానివల్ల ఆ పెరిగిన బరువును వంతెన తట్టుకోలేకపోయి వుంటుందని నివేదిక పేర్కొన్నట్లు పంచల్ తెలిపారు. పైగా ఇటువంటి పనులు చేయడానికిక ఆ కాంట్రా క్టర్లకు అసలు అర్హత లేదని కూడా కోర్టుకు తెలియ జేశారు. అయినప్పటికీ 2007లో ఈ వంతెన మరమ్మతులను ఈ కాంట్రాక్టర్లకు అప్పగించారని, ఆ తర్వాత రెండోసారి 2022లో అప్పచెప్పారని తెలిపారు. అందువల్ల వారినే ఎంపిక చేసుకోవడానికి గల కారణాలు ఏమిటో కనుగొనేందుకు వారిని పోలీసు కస్టడీకి పంపడం అవసరమైందని చెప్పారు. ఎవరి బలవంతంపై వీరిని ఎంపిక చేశారనేది కూడా తెలుసుకోవాల్సి వుందన్నారు.