Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు రాంచీ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసు
న్యూఢిల్లీ : కొద్ది రోజులుగా ఉత్కంఠ కలిగిస్తోన్న జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు తాజాగా ఈడీ సమన్లు జారీ చేసింది. మైనింగ్ లీజులకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో నేడు రాంచీలోని కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నది. రాష్ట్రంలో ఎప్పుడైనా అణుబాంబు పేలొచ్చంటూ జార్ఖండ్ గవర్నర్ రమేశ్ బైస్ చేసిన వ్యాఖ్యలు నిజమైనట్టు కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటివరకూ ముఖ్యమంత్రి రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రా, మరో ఇద్దరు అరెస్టయ్యారు. ఈడీ జులై నెలలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించి మిశ్రాకు చెందిన రూ.11.88 కోట్లు స్వాధీనం చేసుకుంది. అలాగే ఆయన ఇంట్లో లెక్కలోకి రాని రూ.5.34 కోట్లను గుర్తించింది. అలాగే ముఖ్యమంత్రి పాస్‌బుక్స్, ఆయన సంతకం చేసిన చెక్స్‌ను స్వాధీనం చేసుకుంది. సోరెన్ నియోజకవర్గమైన బర్హైత్లో మైనింగ్ వ్యాపారాన్ని మిశ్రా నియంత్రిస్తున్నారని అభియోగాలు మోపింది. గనుల తవ్వకాల్లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అక్రమాలకు పాల్పడ్డారని, సీఎంవో కార్యాలయాన్ని దుర్వినియోగపరిచారని ఇటీవల అభియోగాలు వచ్చాయి. ఎమ్మెల్యేగా ఆయన అభ్యర్థిత్వంపై వేటు వేయటంపై ఈసీ తన నిర్ణయాన్ని ఆగస్టు 25న గవర్నర్‌కు పంపించింది. దాంతో సోరెన్ సభ్యత్వంపై వేటు పడుతుందని కొద్ది నెలలుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఈడీ నుంచి సమన్లు జారీ అవ్వటంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్య మంత్రి పదవిలో ఉన్న ఎమ్మెల్యేపై గవర్నర్ చర్య తీసుకుంటే..ఏర్పడే పరిణామాలపై మోడీ సర్కార్ ఆలోచనలో పడినట్టు సమాచారం. రాజకీయంగా ఇది ఎటు నుంచి ఎటువైపు తిరుగుతుందోనని బీజేపీ అధిష్టానం పునరాలోచనలో పడింది. ప్రస్తుతానికి సీఎం హేమంత్ సోరెన్‌ను అవినీతి పరుడు అనే ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేయాలని భావిస్తోంది. అయితే ఇక్కడ కూడా రాష్ట్ర గవర్నర్ గవర్నర్ బైస్ పాత్ర అత్యంత వివాదాస్పదంగా మారింది. ఆయన రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారంటూ రాష్ట్ర మంత్రులు ఆరోపిస్తున్నారు.