Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలా తీసుకోవచ్చో పరిశీలించండి : కేంద్రాన్ని కోరిన సుప్రీం
న్యూఢిల్లీ : అంగ వైకల్యం కలిగిన వ్యక్తులను సివిల్ సర్వీసెస్‌లోని వివిధ కేటగిరీల్లోకి ఎలా ప్రవేశపెట్టవచ్చో పరిశీలించాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రాన్ని కోరింది. అంగ వైకల్యం కలిగిన వ్యక్తులను ఐపిఎస్, డీఏఎన్‌ఐపీఎస్, ఐఆర్పీఎఫ్ఎస్లోని పోస్టులకు మినహాయిస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమనీ, చట్ట విరుద్ధమని పేర్కొంటూ వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారించింది. అంగ వైకల్యం పట్ల సానుభూతిచూపడం ఒక కోణం, కానీ నిర్ణయం యొక్క ఆచరణాత్మకతను కూడా గమనంలోకి తీసుకోవాల్సి వుందని జస్టిస్ ఎస్.ఎ.నజీర్, జస్టిస్ వి.రామసుబ్రమణియంలతో కూడిన బెంచ్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఒక సంఘటనను సుప్రీం వెల్లడించింది. చెన్నైలో వంద శాతం అంధత్వం వున్న వ్యక్తిని జూనియర్ డివిజన్లో సివిల్ న్యాయమూర్తిగా నియమించారు. ఆయన సంతకం చేసిన అన్ని ఉత్తర్వులను కోర్టు వ్యాఖ్యాతలు పొందారని చెప్పారు. తర్వాత ఆయనను తమిళ జర్నల్ సంపాదకుడిగా నియమించారని చెప్పారు. 'వారు అన్ని కేటగిరీలకు సరిపడకపోవచ్చు. కానీ పరిశీలన జరపాలి. ఇక్కడ ఆచరణాత్మకత అనేది అసలైన కోణంగా వుంటుందని' బెంచ్ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం దీనిపై పరిశీలిస్తోందని, తమకు కొంత సమయం కావాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకట రమణి కోర్టును కోరారు. దాంతో ఎనిమిది వారాల సమయాన్ని కోర్టు ఇచ్చింది. వికలాంగులు ఐపీఎస్, ఐఆర్పీఎఫ్ఎస్, ఢిల్లీ, డామన్ డయ్యు, దాదర్ నగర్ హవేలి, అండమాన్ నికోబాద్ దీవులు, లక్షద్వీప్ పోలీస్ సర్వీస్ (డీఏఎన్‌ఐపీఎస్) వంటి సర్వీసుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు మార్చి 25న అనుమతించింది.