Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జార్ఖండ్ సీఎం హేమంత్ సవాల్
- ఈడీ సమన్ల విషయంలో బీజేపీపై విమర్శలు
రాంచీ : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బీజేపీపై పరోక్షంగా విమర్శల దాడికి దిగారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారా సమన్లు పంపటం కంటే తనను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కేసుల్లో మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణకు సంబంధించి ఈడీ ముందు హాజరు కావాల్సిన రోజు సోరెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. హేమంత్ సోరెన్ రాంచీలోని తన అధికారిక నివాసం వెలుపల వందలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. అనంతరం గిరిజనుల కార్యక్రమంలో పాల్గొనటానికి ఆయన ఛత్తీస్‌గఢ్ వెళ్లారు. ఛత్తీస్‌గఢ్‌లోని రారుపూర్‌లో ఆదివాసీ నృత్య మహౌత్సవముకు తనను ముఖ్య అతిథిగా ముందుగానే ఆహ్వానించారనీ, అదే రోజు ఈడీ తనను పిలవటం కుట్ర అని సోరెన్ అన్నారు. ''నేను ఎవరినైనా హత్య చేశానా? నేనేం నేరం చేశాను? చేసుంటే నన్ను అరెస్టు చేయండి. సమన్లు ఎందుకు పంపాలి? మా ప్రభుత్వం పూర్తి శక్తితో పని చేస్తున్నది'' అని ఆయన అన్నారు. జార్ఖండ్‌లో 'ఆదివాసీలు, ముల్వాసీలు' విజయవంతం కావటం ఇష్టం లేని 'బయటి వ్యక్తి ముఠా' పని చేస్తున్నదని ఆరోపించారు. తాను అందరికీ 'తగిన సమాధానం' ఇస్తున్నానని చెప్పారు. వారు (బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. నాలుగు ఉప ఎన్నికలు జరిగినా, అన్నింటిలోనూ ఓడిపోయారని హేమంత్ సోరెన్ అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ రాష్ట్ర ప్రజల నుంచి సమాధానం వస్తుందని చెప్పారు. తమ కార్యక్రమం 'సర్కార్ ఆప్కే ద్వార్'తో చాలా మందికి ప్రయోజనం చేకూర్చటంతో బీజేపీ 'పానిక్ మోడ్‌లో' ఉన్నదని ఆయన నొక్కి చెప్పారు.