Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు తిరిగి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. గురువారం ఉదయం ఏడు గంటల సమయంలో వాయు నాణ్యత సూచి (ఏక్యూఐ) 408కి చేరుకున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగుల బెట్టడంతో పాటు వాహనాల నుంచి వచ్చే పొగతో ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలిపారు. మంగళవారం 424గా ఉన్న ఏక్యూఐ బుధవారం నాటికి 376కి మెరుగైంది. గతేడాది డిసెంబర్ 26న ఏక్యూఐ 459కి చేరుకుందనీ, ఇది అతిచెత్తరికార్డుగా పేర్కొన్నారు. విషపూరిత గాలిని పీల్చడంతో స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పీఎం 2.5 మైక్రాను లేదా అంతకంటే తక్కువగా ఉండే సూక్ష్మ ధూళికణాలు శ్వాసనాళాల గుండా ఊపిరితిత్తుల్లోకి అక్కడి నుంచి రక్తప్రవాహంలోకి చేరతాయని అన్నారు. దీంతో శ్వాస, ఊపిరితిత్తుల సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే సమయం కావడంతో చిన్నారులు తీవ్ర అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని అన్నారు. వాయు నాణ్యతా ప్రమాణాలు మెరుగయ్యేంతవరకు పాఠశాలలను మూసివేయాల్సిందిగా ఆదేశించాలని చిన్నారుల హక్కుల సంఘం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కి విజ్ఞప్తి చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో కొన్ని ప్రయివేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అయితే పాఠశాలలు మూసివేత ఈ సమస్యకు పరిష్కారం కాదనీ.. కాలుష్య స్థాయిలను తగ్గించేందుకు దీర్ఘకాల చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.