Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్మగ్లింగ్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందంటూ సీఎంఓపై కేరళ గవర్నర్ ఆరోపణలు
న్యూఢిల్లీ : కేరళ గవర్నర్‌కు, పాలక వామపక్ష ప్రభుత్వానికి మధ్య కొనసాగుతున్న ఘర్షణ గురువారం తారాస్థాయికి చేరింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కార్యాలయం స్మగ్లింగ్ కార్యకలాపాలను ప్రోత్సాహమిస్తోందని గవర్నర్ ఆరోపించారు. వైస్ ఛాన్సలర్ల నియామకంతో సహా పలు అంశాలపై ఖాన్, రాష్ట్ర ప్రభుత్వం ఘర్షణ పడుతున్నాయి. అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులు రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో పడి వున్నాయి. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు వెంటనే రాజీనామా చేయాలని గత నెల్లో గవర్నర్ కోరారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తోసిపుచ్చింది. వైస్ ఛాన్సలర్లు తమ పదవుల్లో కొనసాగాలని హైకోర్టు ఆదేశాలు కూడా వెలువడ్డాయి. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.ఎన్.బాలగోపాల్ గవర్నర్ పదవిపై వ్యాఖ్యలు చేసినందున తక్షణమే ఆయన్ని మంత్రివర్గం నుండి తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రికి గవర్నర్ ఒక లేఖ రాశారు. విజయన్ ఆ డిమాండ్‌ను కూడా తోసిపుచ్చారు. ఈసారి, వర్శిటీ వైస్ ఛాన్సలర్ల నియామకంలో తన జోక్యం వుందని ఒక్క ఉదాహరణ చూపినా తాను రాజీనామా చేస్తానని గవర్నర్ ప్రతిపాదించారు.
తిరువనంతపురంలోని ఒక సదస్సులో బుధవారం నాడు తనపై ముఖ్యమంత్రి విజయన్ చేసిన ఆరోపణలపై స్పందన ఏమిటని విలేకర్లు ప్రశ్నించగా, గవర్నర్ పై రీతిన సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను ఆర్ఎస్ఎస్, సంఘ పరివార్ కేంద్రాలుగా మార్చడానికి గవర్నర్ ప్రయత్నిస్తున్నారని విజయన్ విమర్శించారు. కాషాయీకరణ ఎజెండాను అమలు చేయడానికి ఖాన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ''ఆర్ఎస్ఎస్ వ్యక్తులను తీసుకువచ్చేందుకు వైస్ ఛాన్సలర్లపై చర్య తీసుకోవాలని కోరుతున్నానని వారంటున్నారు. ఆర్ఎస్ఎస్కి చెందినవారినే కాదు, ఏ ఒక్క వ్యక్తినైనా నా స్వంతంగా, నా అధికారాలను ఉపయోగించి నేను నామినేట్ చేసినట్లైతే అప్పుడు నేను వెంటనే రాజీనామా చేస్తాను. ఒకవేళ ఈ ఆరోపణలు రుజువు చేయలేకపోతే ముఖ్యమంత్రి రాజీనామా చేయగలరా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను.'' అని న్యూఢిల్లీలో విలేకర్లతో మాట్లాడుతూ గవర్నర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో స్మగ్లింగ్ కార్యకలాపాలను ముఖ్యమంత్రి కార్యాలయం ప్రోత్సహిస్తోందని గవర్నర్ ఆరోపించారు. ఒకవేళ అటువంటి పరిస్థితే వున్నట్లైతే జోక్యం చేసుకోవడానికి తనకు అధికారం వుంటుందని అన్నారు. ''నేనెన్నడూ జోక్యం చేసుకోలేదు. కానీ, ముఖ్యమంత్రి కార్యాలయం అక్రమ రవాణా కార్యకలాపాలన్నింటినీ ప్రోత్సహించడం చూస్తున్నా. పుస్తకాలు రాస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేని తమ బంధువులను నియమించాల్సిందిగా సిఎంఓ కార్యాలయంలో కూర్చున్న వ్యక్తులు కన్నూర్ వర్శిటీ వైస్ ఛాన్సలర్‌ను ఆదేశిస్తున్నారు. అయినా నేనెన్నడూ జోక్యం చేసుకోలేదు.'' అని గవర్నర్ వ్యాఖ్యానించారు. ''అయితే రాష్ట్ర ప్రభుత్వం సిఎంఓ, ముఖ్యమంత్రికి సన్నిహితులైన వ్యక్తులు అక్రమ రవాణా కార్యకలాపాలను ప్రోత్సహిస్తే కచ్చితంగా నేను జోక్యం చేసుకోవాల్సిందే.'' అని ఖాన్ అన్నారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు చేయలేని పక్షంలో ముఖ్యమంత్రి రాజీనామా చేయగలరా? అని ఖాన్ బహిరంగంగా సవాలు చేశారు. 'నాపై ఇంతటి తీవ్రమైన ఆరోపణ చేసినపుడు, మీరు దాన్ని నిరూపించగలగాలి.'' అని ఖాన్ స్పష్టం చేశారు.