Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధ్యాయుల సంఖ్య 2.8 లక్షలు తగ్గుదల :కేంద్ర విద్యాశాఖ రిపోర్టు
న్యూఢిల్లీ : దేశంలో ఏడాది (2020-21)లో 20 వేల పాఠశాలలు మూతపడ్డాయని కేంద్ర విద్యా శాఖ రిపోర్టు స్పష్టం చేసింది. గతేడాదితో పోల్చితే దేశంలో ఉపాధ్యాయుల సంఖ్య 1.95 శాతం తగ్గిందని పేర్కొంది. 2021-22లో దేశంలో పాఠశాల విద్యపై యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ) పేరుతో రూపొందించిన నివేదికను గురువారం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దేశంలో 44.85 శాతం పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్ సౌకర్యాలు ఉన్నాయని, 55.15 శాతం పాఠశాలల్లో కంప్యూటర్ సౌకర్యం లేదని పేర్కొంది. ఇంటర్నెట్ కనెక్షన్‌ను కలిగి ఉన్న పాఠశాలలు 34 శాతం మాత్రమేననీ, 66 శాతం పాఠశాల్లలో ఇంటర్నెట్ సదుపాయం లేదని పేర్కొంది. 2020-21లో దేశంలో 15.09 లక్షల పాఠశాలలు ఉంటే, 2021-22లో 14.89 లక్షల పాఠశాల ఉన్నాయని పేర్కొంది. 2020-21లో మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య 97.87 లక్షలు కాగా, 2021-22లో 95.07 లక్షలకు తగ్గిందని తెలిపింది. 2.8 లక్షల మంది ఉపాధ్యయులు తగ్గారని పేర్కొంది. 2020-21లో 35.4 మిలియన్ల నుంచి 2021-22లో 34.4 మిలియన్లకు ప్రిమరీ ఉపాధ్యాయులు తగ్గారనీ, 2020-21లో 21.5 శాతం నుంచి 2021-22లో 18.9 శాతం వరకు ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు తగ్గారని పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే 2021-22లో ప్రభుత్వ పాఠశాలల్లో 0.9 శాతం, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 1.45 శాతం, ప్రయివేట్ పాఠశాలల్లో 2.94 శాతం, ఇతర పాఠశాలల్లో 8.3 శాతం ఉపాధ్యాయుల తగ్గుదల నమోదైందని తెలిపింది. 27 శాతం పాఠశాలల్లో మాత్రమే ప్రత్యేక అవసరాలు (సీఎస్‌డబ్ల్యూఎన్) ఉన్న పిల్లలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నాయని, వాటిలో 49 శాతానికి పైగా హ్యాండ్రైల్లతో కూడిన ర్యాంప్‌లు ఉన్నాయని పేర్కొంది.2020-21లో 25.38 కోట్ల మంది విద్యార్థుల నమోదుతో పోలిస్తే, 2021-22లో ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ వరకు పాఠశాల విద్యలో చేరిన మొత్తం విద్యార్థులు సంఖ్య 25.57 కోట్లకు పెరిగింది. అంటే 19.36 లక్షలు విద్యార్థులు పెరిగారు. 2020-21లో 4.78 కోట్లుగా ఉన్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల నమోదు, 2021-22 నాటికి 4.82 కోట్లకు పెరిగింది. అదేవిధంగా, మొత్తం షెడ్యూల్డ్ తెగల విద్యార్థుల నమోదు 2020-21లో 2.49 కోట్ల నుండి 2021-22 లో 2.51 కోట్లకు పెరిగింది. 2020-21లో 11.35 కోట్లుగా ఉన్న ఇతర వెనుకబడిన విద్యార్థులు, 2021-22లో 11.48 కోట్లకు పెరిగారు. విద్యుత్ కనెక్షన్ ఉన్న పాఠశాలలు 89.3 శాతం, తాగునీరు ఉన్న పాఠశాలలు 98.2 శాతం, బాలికల టాయిలెట్లు ఉన్న పాఠశాలలు 97.5 శాతం, సిడబ్ల్యుఎస్ఎన్ టాయిలెట్లు ఉన్న పాఠశాలలు 27 శాతం, హ్యాండ్ వాష్ సదుపాయం ఉన్న పాఠశాలలు 93.6 శాతం, ఆటస్థలం ఉన్న పాఠశాలలు 77 శాతం, సిడబ్ల్యుఎస్ఎన్ కోసం హ్యాండ్ రెయిల్తో ర్యాంప్ ఉన్న పాఠశాలలు 49.7 శాతం, లైబ్రరీ, రీడింగ్ రూమ్రీ, డింగ్ కార్నర్ ఉన్న పాఠశాలలు 87.3 శాతం, కిచెన్ గార్డెన్ ఉన్న పాఠశాలలు 27.7 శాతం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉన్న పాఠశాలలు 21 శాతం ఉన్నాయి.
ఏపిలో 1,395 స్కూల్స్ మూసివేత
ఆంధ్రప్రదేశ్‌లో 2002-21 నుంచి 2021-22 వరకు ఏడాదిలో 1,395 పాఠశాలలు మూసివేతకు గురయ్యాయి. అలాగే 1,463 మంది ఉపాధ్యాయులు తగ్గారు. 2020-21లో ఏపిలో 63,343 పాఠశాలలుండగా, 2021-22 నాటికి 61,948 పాఠశాలలు తగ్గాయి. 2020-21లో 3,22,187 ఉపాధ్యాయులు ఉండగా, 2021-22లో 3,20,724 ఉపాధ్యాయులకి తగ్గారు.