Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ పార్టీల నాయకులకు వినతులు
విశాఖపట్నం : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా అన్ని పార్టీల నాయకులూ ఈ నెల 11న విశాఖకు వస్తున్న ప్రధాని మోడీపై ఒత్తిడి పెంచాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కోరారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు మద్దతుగా వారు వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, బీజేపీ. ఆమ్ఆద్మీ పార్టీల నాయకులకు గురువారం వినతిపత్రాలు సమర్పించారు. మరోపక్క వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు 630వ రోజుకు చేరుకున్నాయి. ఎస్ఎంఎస్-1 కార్మికులు దీక్షల్లో కూర్చున్నారు. వారినుద్దేశించి పోరాట కమిటీ నాయకులు డి ఆదినారాయణ, జె అయోధ్యరామ్, జె రామకృష్ణ, వరసాల శ్రీనివాసరావు, జి సుబ్బయ్య, బి అప్పారావు మాట్లాడారు.
దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య పెరిగిందన్నారు. అన్ని పరిశ్రమల వద్ద నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని తెలిపారు. దేశంలో కొత్త పరిశ్రమలు నెలకొల్పకపోగా ఉన్న పరిశ్రమలను ప్రైవేటుపరం చేయడం, కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టడం ప్రజాద్రోహమన్నారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మస్తానప్ప, మంత్రి రాజశేఖర్, జివి రమణ, కె రాజబాబు పాల్గొన్నారు.