Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 34 శాతం స్కూళ్లలోనే ఇంటర్నెట్
- 50 శాతం కంటే తక్కువ పాఠశాలల్లో ఫంక్షనల్ కంప్యూటర్లు
- ఢిల్లీ స్కూళ్లు భేష్ : యూడీఐఎస్ఈ
మోడీ పాలనలో విద్యావ్యస్థ అనేక కష్టాలను ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా, డిజిటలైజేషన్ గురించి ఎక్కువగా మాట్లాడే బీజేపీ సర్కారు.. దేశంలోని విద్యార్థులకు మాత్రం ఆ వసతులను కల్పించలేకపోతున్నది. దేశవ్యాంగా ఇప్పటికీ అనేక స్కూళ్లలోని విద్యార్థులు ఇంటర్నెట్, కంప్యూటర్లు వంటి సదుపాయాలను పొందలేకపోతున్నారు. కేంద్రం గణాంకాలే ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి.
న్యూఢిల్లీ : భారత్లోని బడులు డిజిటల్ విషయంలో వెనకబడి ఉన్నాయి. ఇప్పటికీ దేశంలోని అనేక పాఠశాలలకు ఇంటర్నెట్, కంప్యూటర్లు వంటివి అందటం లేదు. మరికొన్ని స్కూళ్లకు వాటిని పొందటమే గగనంగా మారిన పరిస్థితులు దేశంలో ఉన్నాయి. దీంతో సాంకేతిక పరంగా విద్యార్థులు వెనకబడి పోతున్నారు. భారత్లో 34 శాతం స్కూళ్లు మాత్రమే ఇంటర్నెట్ను పొందుతున్నాయి. కేవలం 50 శాతం కంటే తక్కువ పాఠశాలల్లో ఫంక్షనల్ కంప్యూటర్లు ఉన్నాయి. కాగా, ఈ రెండు విషయాల్లో ఢిల్లీ స్కూళ్లు వంద శాతం చక్కని ప్రదర్శనను కనబరిచాయి. దేశంలోని స్కూళ్లలో విద్యార్థులకు ఇంటర్నెట్, కంప్యూటర్లు వంటి వసతులు అందే విషయమై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారంలో ఈ విషయం వెల్లడైంది.
యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడీఐఎస్ఈ) 2021-22 సమాచారం ప్రకారం.. భారత్లోని 14,89,115 స్కూళ్లలో కేవలం 5,04,989 పాఠశాలల్లో (33.9 శాతం) ఇంటర్నెట్ వసతులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 24.2 శాతం ప్రభుత్వ పాఠశాలలు, 53.1 శాతం ప్రభుత్వ ఎయిడెడ్, 59.6 శాతం ప్రయివేటు స్కూళ్లు ఇంటర్నెట్కు నోచుకుంటున్నాయి. ఇక స్కూళ్లలో ఫంక్షనల్ కంప్యూటర్ల విషయానికొస్తే.. కేవలం 6,82,566 స్కూళ్లలో ( 45.83 శాతం )ఈ సదుపాయం ఉన్నది. వీటిని కలిగి ఉన్న ప్రభుత్వ స్కూళ్లు 35.8 శాతమే. ఇక 67.5 శాతం ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లు, 71.9 శాతం ప్రయివేటు స్కూళ్లు ఫంక్షనల్ కంప్యూటర్లను కలిగి ఉన్నాయి. ఇక ఫంక్షనల్ కంప్యూటర్ల వసతులకు నోచుకోని స్కూళ్ల సంఖ్య 8,06,549 (54.16 శాతం) గా ఉండటం గమనార్హం.
ఢిల్లీ స్కూళ్లలో వంద శాతం ఇంటర్నెట్, ఫంక్షనల్ కంప్యూటర్లు
రాష్ట్రాలవారీగా చూస్తే ఇంటర్నెట్, ఫంక్షనల్ కంప్యూటర్ల విషయంలో ఢిల్లీ స్కూళ్లు వంద శాతం చక్కటి ప్రవర్శనను కనబర్చాయి. ఇక్కడి అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేటు స్కూళ్లు వంద శాతం ఇంటర్నెట్, కంప్యూటర్లను కలిగి ఉన్నాయి. ఈ రెండు అంశాల్లో పంజాబ్, చండీగఢ్లలోని స్కూళ్లు కూడా 99 శాతంతో ముందున్నాయి. చండీగఢ్, పుదుచ్చేరిలలో 98 శాతం స్కూళ్లు ఇంటర్నెట్ వసతిని కలిగి ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా 13.4 శాతం పాఠశాలల్లో ఫంక్షనల్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు లేకపోవటం గమనార్హం.
డిజిటలీకరణ యుగంలోనూ లక్షలాది పాఠశాలలు ఇంటర్నెట్, కంప్యూటర్ల వంటి సదుపాయాలను పొందకపోవటానికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యపూరిత వైఖరే కారణమని నిపుణులు, విశ్లేషకులు తెలిపారు. ప్రయివేటు స్కూళ్లతో పోలిస్తే ప్రభుత్వ స్కూళల్లోనే ఈ సమస్యలు అధికంగా ఉండటం దీనికి నిదర్శనమన్నారు. ప్రభుత్వాలు విద్యకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు పెంచి వాటిని పూర్తిగా ఖర్చు చేయాలని సూచించారు. అలా చేయకపోతే దేశంలోని ఒక తరం సాంకేతికంగా వెనకబడిపోయి అది దేశ భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.