Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇసుదాన్ గఢ్వ పేరును ఖరారు చేసిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ స్వంత రాష్ట్రం...గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలకు వివిధ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్ సీఎం అభ్యర్థిగా మాజీ జర్నలిస్టు, టీవీ యాంకర్ ఇసుదాన్ గఢ్వని (40) కేజ్రీవాల్ ఎంపికచేశారు. ఇక ఈ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో ఆప్ ఎన్నికల బరిలో పోరాడనున్నది. దాదాపు పాతికేండ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీని గద్దె దింపేందుకు కాంగ్రెస్, ఆప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. 182 స్థానాలున్న శాసనసభకు డిసెంబర్ 1, 5వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 8న ఓట్ల లెక్కింపు ఉండబోతోంది. పంజాబ్ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపికచేసే అవకాశాన్ని ప్రజలకు ఇచ్చామని, భగవంత్ మాన్‌ను కోరుకోవటంతో ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి చేశామని ఆప్ చెప్పుకొచ్చింది. గుజరాత్‌లోనూ అదే పద్ధతిలో సీఎం అభ్యర్థి ఎంపిక ఉంటుందని ప్రకటించింది. ఈనేపథ్యంలో పార్టీ నిర్వహించిన సర్వేలో మాజీ టీవీ యాంకర్ ఇసుదాన్ గఢ్వని 73శాతం మంది మద్దతు పలకడంతో ఆయన్ని సీఎం అభ్యర్థిగా ఆప్ ఎంచుకుంది.
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం మాట్లాడుతూ..''గుజరాత్ శాసనసభ ఎన్నికలకు సీఎం అభ్యర్థిగా ఇసుదాన్ గఢ్వని ఆప్ ఎంపికచేసింది. మేం నిర్వహించిన సర్వేలో దాదాపు 16లక్షల మంది పాల్గొన్నారు. వారిలో 73శాతం మంది గఢ్వకి మద్దతు పలికారు. ద్వారకా జిల్లా పిపాలియా గ్రామానికి చెందిన గఢ్వ మాజీ టీవీ యాంకర్. ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చారు'' అని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ శాఖ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా ఈ సర్వేలో బాగా వెనుకబడ్డారు. ఆయన పటీదార్ ఆందోళన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆప్ ఇప్పటివరకు 118 మంది అభ్యర్థులను ప్రకటించింది. సీఎం అభ్యర్థి ఇసుదాన్ గఢ్వ గత ఏడాది జూన్‌లో ఆప్‌లో చేరారు. ప్రముఖ గుజరాతీ టీవీ ఛానల్లో ఆయన యాంకర్‌గా పనిచేశారు.