Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాట్నా : 200మంది ఉర్దూ ట్రాన్స్‌లేటర్స్, స్టెనోగ్రాఫర్స్ నియామకాలను వ్యతిరేకిస్తూ... బీజేపీ చేసిన వ్యాఖ్యలను బీహార్ సీఎం నితీష్‌కుమార్ తిప్పికొట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో.. నితీష్‌కుమార్ సుమారు 200 మంది ఉర్దూ ట్రాన్స్లేటర్లకు, స్టెనోగ్రాఫర్లకు అపాయింట్మెంట్ లెటర్లను గురువారం అందచేశారు. ఈ నియామకాలపై బీజేపీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నితీష్‌కుమార్ ఖండించారు. పేద రాష్ట్రాలపై మోడీ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న దీర్ఘకాల డిమాండ్‌ను కేంద్రం పక్కనపెట్టిందనీ, అన్ని పేద రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పొందే హక్కు ఉందని స్పష్టం చేశారు. సమాజంలోని బలహీన వర్గాలను ముఖ్యంగా మైనారిటీలు, దళితుల అభివద్ధికి తమ ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందని... దీనిలో భాగంగా ఈ నియామకాలు చేపట్టామని అన్నారు. బీహార్‌ను మరో పాకిస్థాన్‌లా మార్చవద్దంటూ రాష్ట్ర బిజెపి ప్రతినిధి నిఖిల్ ఆనంద్ వ్యాఖ్యానించారు. నితీష్‌కుమార్ బీహార్‌ను ఉర్దూమయం చేయాలని చూస్తున్నారని, బీహార్ అసెంబ్లీలో ఉర్దూ అనువాదకుల అవసరమేంటని ప్రశ్నించారు.