Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళ మంత్రి బింధు
అలఫుజ : యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లందరినీ ఒకేసారి తొలగించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేయడం ఉన్నత విద్యారంగాన్ని నాశనం చేయాలని భావించడమేనని కేరళ ఉన్నత విద్య, సామాజిక న్యాయ శాఖ మంత్రి ఆర్. బింధు విమర్శించారు. తన విశ్వాసం కోల్పోయినందున ఆర్థిక మంత్రిని తొలగించాలని కోరడం కూడా రాచరికపు కాలం నాటి సంప్రదాయమని అన్నారు. అలఫుజలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర సదస్సులో భాగంగా ఏర్పాటు చేసిన ''న్యూ కేరళ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్'' సెమినార్‌ను మంత్రి ప్రారంభించారు. కేరళలో ఉన్నత విద్య అజెండాను ఆర్ఎస్ఎస్ నిర్దేశించాలని అనుకుంటోందని, ఇది ఆందోళనకరమని అన్నారు. సమాజాన్ని విభజించి నాశనం చేస్తున్న రహస్య విచ్ఛిన్నకర శక్తులు కేరళలోని ఉన్నత విద్యారంగంపై దాడి చేస్తున్నాయని విమర్శించారు. కేరళ ప్రగతిశీల ఆలోచనలను నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. రక్షకుడిగా ఉండాల్సిన వారే శిక్షకుడిగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కేరళలో యూని వర్శిటీలు మంచి పనితీరుతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా బడ్జెట్లో ప్రకటించిన ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, ఉన్నత విద్యారంగంలో కేరళ నంబర్‌వన్‌గా మారుతుందని మంత్రి తెలిపారు.