Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు ఎలా స్వీకరించింది?
- ఆ పార్టీకున్న అర్హతేంటో ప్రశ్నించాల్సింది..
- ఎమ్మెల్యేల కొనుగోళ్లు నిందితుల బెయిల్ పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం
న్యూఢిల్లీ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వేటాడేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న ఆరోపణలపై తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు వ్యక్తుల బెయిల్ పిటిషన్ విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఎటువంటి ఉపశమనం ఇవ్వకుండానే సోమవారానికి (నవంబర్ 7) వాయిదా వేసింది. బీజేపీ ఏజెంట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజి స్వామి అనే ముగ్గురు వ్యక్తులు సైబరాబాద్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ ఎదుట లొంగిపోవాలని తెలంగాణ హైకోర్టు అక్టోబర్ 29న ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది కె.వి విశ్వనాథన్ వాదనలు వినిపిస్తూ డబ్బు రికవరీ కానందున, వారు లొంగిపోవాలని హైకోర్టు తప్పుగా ఆదేశించిందని తెలిపారు. ఏడేండ్లలోపు శిక్షపడే కేసుల్లో 41 (ఏ) నోటీసు ఇవ్వకుండా నిందితులని అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నా అందుకు విరుద్ధంగా అరెస్టు చేశారని తెలిపారు. అరెస్టులో మార్గదర్శకాలను కూడా ఉల్లంఘించారని పేర్కొన్నారు. బీజేపీని కించపరిచేలా, పిటిషనర్లను ఇరికించేందుకే టీఆర్ఎస్ నేతల కోరిక మేరకు ఈ ఫిర్యాదు దాఖలయ్యిందని వాదనలు వినిపించారు. ఈ దశలో జస్టిస్ బి.ఆర్ గవారు జోక్యం చేసుకొని నగదు స్వాధీనం చేసుకున్న ట్రాప్ కేసుల్లోనూ అదే రోజు బెయిల్ ఇస్తున్నారు కదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా జోక్యం చేసుకుంటూ దర్యాప్తు కోరుతూ ఓ రాజకీయ పార్టీ (బీజేపీ) హైకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. దర్యాప్తుపై స్టే విధించాలని హైకోర్టులో ఓ పార్టీ ఎందుకు పిటిషన్ దాఖలు చేసిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఆ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు ఎలా స్వీకరించిందని ధర్మాసనం ప్రశ్నించింది. నిందితుల తరపు న్యాయవాది విశ్వనాథన్ స్పందిస్తూ తాము ఆ పిటిషన్ దాఖలు చేయలేదన్నారు. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌తో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సంబంధం లేని విషయంలో తాము ఎందుకు ఇబ్బందిపడాలన్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వారెవరని (బీజేపీ) లూథ్రా ప్రశ్నించారు. ఈ దశలో జస్టిస్ బి ఆర్ గవారు జోక్యం చేసుకొని, పిటిషన్ దాఖలు చేయడానికి ఆ పార్టీకి ఉన్న అర్హత (లోకస్) ఏమిటని హైకోర్టు ప్రశ్నించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఒక రాజకీయ పార్టీ పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని విచారించాల్సిన అవసరం హైకోర్టుకు ఏముందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య పోరులో తాము బాధితులుగా నలిగిపోతున్నామని, ఎవరో పిటిషన్ దాఖలు చేస్తే తమను నిందిస్తున్నారని విశ్వనాధన్ ధర్మాసనానికి తెలిపారు. పిటిషనర్లు అరెస్టు కాకముందే ఆ పిటిషన్ దాఖలైందనీ, అందులో తాము భాగస్వాములుగా లేమని ఆయన తెలిపారు. హైకోర్టు విచారణలో ఏం జరిగిందని ధర్మాసనం ప్రశ్నించగా దర్యాప్తు చేయకుండా శుక్రవారం వరకు హైకోర్టు పెండింగ్‌లో పెట్టి తమ చేతులు కట్టివేసిందని లూథ్రా తెలిపారు. నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని, అవి ఏడో తేదీన విచారణకు వస్తున్నాయని లూథ్రా తెలిపారు. అనంతరం నిందితుల బెయిల్ పిటిషన్లపై ఎసిబి కోర్టు విచారణ చేపట్టడానికి సుప్రీం కోర్టుతో పాటు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు అడ్డంకి కాదనీ, నిబంధనల ప్రకారం విచారణ చేపట్టవచ్చని అని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కోర్టు ఉత్తర్వులు జారీ తరువాత కూడా తాము దాఖలు చేసిన రిమాండ్ అప్లికేషన్‌ను పరిశీలించాలని ట్రయల్ కోర్టు ఆదేశించాలని లూథ్రా ధర్మాసనానికి పదే పదే విజ్ఞప్తి చేశారు. ఇలానే విజ్ఞప్తి చేస్తే నిందితులకు బెయిల్ ఇచ్చేమని ధర్మాసనం హెచ్చరించింది.