Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు
- దేశాన్ని న్యాయవ్యవస్థ నడిపించాలా? లేక ఎన్నికైన ప్రభుత్వామా? అని ప్రశ్న
- న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు పెంచబోమని వెల్లడి
న్యూఢిల్లీ : ''దేశాన్ని న్యాయవ్యవస్థ నడిపించాలా? లేక ఎన్నికైన ప్రభుత్వమా?'' అని కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు. ''న్యాయవ్యవస్థ నిబంధనలను రూపొందించడం ప్రారంభిస్తే, రహదారి ఎక్కడ నిర్మించాలో నిర్ణయిస్తుంది. న్యాయవ్యవస్థ సర్వీస్ నియమాలలోకి వస్తే ఇంకా ప్రభుత్వం దేనికి'' అని ఆయన అన్నారు. ముంబాయిలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్లో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడారు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యనిర్వహక వ్యవస్థలోకి ప్రవేశించడంతో న్యాయవ్యవస్థ తన సరిహద్దులను అతిక్రమించకూడదనీ, దేశాన్ని నడిపించే పనిని ఎన్నికైన ప్రతినిధులకే వదిలివేయాలని అన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందనీ, న్యాయవ్యవస్థ కూడా రాజ్యాంగ సరిహద్దులను గౌరవించాలనీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా లక్ష్మణరేఖను దాటకూడదని మంత్రి పేర్కొన్నారు. ''ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. మనది ప్రజాస్వామ్య దేశం. దేశ సార్వభౌమాధికారం దేశ ప్రజలపై ఉంది. దేశ ప్రజలు తమను తాము పాలించుకుంటారు. ప్రజలు తమను తాము ఎలా పరిపాలించుకోవాలో నిర్ణయించుకుంటారు. కాబట్టి ప్రజలు ఎన్నుకోబడిన ప్రతినిధులతో తమను తాము పరిపాలించుకుంటారు. దేశాన్ని న్యాయవ్యవస్థ నడిపించాలా లేక ఎన్నుకోబడిన ప్రభుత్వమా' అని ఆయన ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ ఎగ్జిక్యూటివ్ డొమైన్‌లోకి ప్రవేశించడం, నియమాలను రూపొందించడం, కార్యనిర్వాహక విధులను నిర్వహించడానికి ప్రయత్నించడం వంటి ధోరణిని ఆయన తిరస్కరించారు.
లక్ష్మణ రేఖ దాటొద్దు
''రాజద్రోహ చట్టంలోని నిబంధనను మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని సుప్రీంకోర్టుకు చెప్పాం. అయినప్పటికీ సుప్రీంకోర్టు దేశద్రోహ చట్టంలోని నిబంధనలను కొట్టివేసింది. దాని గురించి నేను చాలా బాధపడ్డాను. ఇవి నిజంగా నన్ను కలవరపరిచే అంశాలు. పాత చట్టం నిబంధనలు, మేము దానిని తిరిగి పరిశీలిస్తున్నాం. అయినప్పటికీ కోర్టు నుండి ప్రకటన వస్తే, అది ఖచ్చితంగా మంచిది కాదు. అందుకే నేను ఆ సమయంలో కూడా స్పందించాను. అందరికీ లక్ష్మణ రేఖ ఉంది. దేశ ప్రయోజనాల కోసం లక్ష్మణ రేఖను దాటొద్దు'' అని ఆయన అన్నారు.
న్యాయమూర్తుల పదవీవిరమణ వయస్సు పెంచం
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును పెంచే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు, న్యాయ వ్యవస్థలో ఖాళీలు కేసుల పెండింగ్‌కు కారణం కాదని మంత్రి అన్నారు.
రెగ్యులర్‌గా నియామకాలు జరుగుతున్నప్పటికీ, న్యాయవ్యవస్థలో ఎప్పుడూ 20 శాతం ఖాళీలు ఉంటాయని మంత్రి తెలిపారు. న్యాయ వ్యవస్థపై భారాన్ని పెంచే అర్హత లేని కేసులు సుప్రీంకోర్టు వరకు ఎలా వెళ్తాయని ఆయన ప్రశ్నించారు. మధ్యవర్త్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించేలా ప్రభుత్వం యంత్రాంగాన్ని అభివృద్ధి చేయడానికి పరిశీలిస్తోందని ఆయన అన్నారు. 2015లో జాతీయ న్యాయ కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ, దానికి మెరుగైన ప్రత్యామ్నాయాన్ని అందించలేదని పేర్కొన్నారు.