Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అణగారిన వర్గాల అభ్యున్నతికి భరోసా
- వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం : కేరళ మంత్రి
తిరువనంతపురం : అణగారిన వర్గాల సామాజిక-ఆర్థిక అభ్యున్నతికి భరోసా కల్పించటంతోపాటు వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కేరళ పశుసంవర్థక, పాడిపరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి జె. చించురాణి అన్నారు. కొల్లాం జిల్లా పంచాయతీ హాలులో లైఫ్ మిషన్ లబ్దిదారుల సమ్మేళనాన్ని ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇండ్లు ఉన్న కుటుంబాలన్నీ ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమన్నారు. ''అందరికీ భూమి, ఇండ్లు అందించటమే లక్ష్యం. ఇందుకోసం స్థానిక సంస్థలు, వివిధ శాఖలు, హౌజింగ్ బోర్డు సహకారంతో ఆదర్శప్రాయమన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. లబ్ధిదారులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావటానికి చేస్తున్న కృషిలో భాగమే ఇక్కడ నిర్వహిస్తున్న సమావేశం'' అని ఆమె తెలిపారు. హౌజింగ్ బోర్డు సహకారంతో జిల్లాలో నిరుపేదలకు 100 ఇండ్లు నిర్మించి ఇస్తామని ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా పంచాయతీ అధ్యక్షుడు సామ్ కె. డానియల్ అన్నారు. స్వప్నగూడు ప్రాజెక్టు కింద పూర్తి చేసిన ఇండ్ల తాళాలు వచ్చే ఏడాది లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు.
లైఫ్ మిషన్ ప్రాజెక్టు మూడో దశలో భాగంగా జిల్లాలో 3,769 మంది భూమిలేని లబ్ధిదారులకు భూమిని అందించారు. 2,853 ఇండ్లు పూర్తికాగా,1443 ఇండ్ల పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం భూనిర్వాసితుల కోసం పునలూర్ మున్సిపాలిటీలోని వాలాకోడ్, అంచల్-థజమెల్లో ఫ్లాట్ కాంప్లెక్స్‌ల నిర్మాణం సాగుతోంది. వాలాకోడ్లో దాదాపు 95శాతం పనులు పూర్తి కాగా, కడకల్ గ్రామ పంచాయతీ కేర్ హౌమ్ పథకం కింద 37 ఫ్లాట్ యూనిట్ల నిర్మాణానికి మంజూరు చేసింది. భూ నిర్వాసితులకు భూమిని అందించేందుకు ప్రారంభించిన 'మనస్సోదితిరి మన్ను' కార్యక్రమంలో భాగంగా జిల్లా యంత్రాంగం 135 సెంట్ల భూమిని కూడా అందుబాటులోకి తెచ్చింది.