Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గతేడాది జులైలో ఐఏఎఫ్ ఎయిర్‌మెన్ పరీక్ష
- ఫలితాల కోసం 6.34 లక్షల మంది ఎదురుచూపు
న్యూఢిల్లీ : గతేడాది జులైలో జరిగిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) ఎక్స్, వై గ్రూప్ ఎయిర్మెన్లకు జరిగిన పరీక్షా ఫలితాలు ఇంకా వెల్లడికాలేదు. ఈ పరీక్ష రాసిన 6.34 లక్షల మంది అభ్యర్థులు ఫలితాల కోసం ఇంకా వేచి చూస్తున్నారు. ఈ ఫలితాలు ఏడాది దాటిపోయినా ప్రభుత్వం వెల్లడించకపోవడం గమనార్హం. అగ్నిపథ్ పథకాన్ని ముందుకు తెచ్చినందు వల్లే ఈ పరీక్షా ఫలితాలను నిర్లక్ష్యం చేశారని అభ్యర్థులు వాపోతున్నారు. పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఒకరైన మహమ్మద్ కమాల్ అనే అభ్యర్థి సమాచార హక్కు ద్వారా సంబంధిత అధికారులను ప్రశ్నించాడు. పరీక్షా ఫలితాలు ఇప్పటివరకూ వెలువడలేదని, పరీక్ష కోసం అభ్యర్థులు వెచ్చించిన డబ్బును తిరిగి అభ్యర్థులకు చెల్లించలేదని పేర్కొన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ నివాసి అయిన మహమ్మద్ కమాల్ సేకరించిన సమాచారం ప్రకారం, ఈ పరీక్షకు 6,34,249 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం కమాల్ అలీఘఢ్ ముస్లిం యూనివర్సిటీలో లా చదువుతున్నాడు.
ఫలితాలపై కమాల్ మాట్లాడుతూ..''జనవరి 2021లో ఎయిర్మెన్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ పూర్తి చేసుకున్న నేను దరఖాస్తు చేసుకున్నా. పరీక్ష కోసం ఎంతగానో సన్నద్ధమయ్యా. ఆ ఏడాది జులై 12, జులై 18 తేదీల్లో పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షా ఫలితాల్ని నెలలోపే ప్రకటించాలి. కానీ ఎందుకనో నిలిపివేశారు. పరిపాలనా కారణాల్ని సాకుగా చూపుతున్నారు. ఇదే పరీక్ష గతంలో ఏడాదికి రెండుసార్లు నిర్వహించేవారు. 2020, 2021 సంవత్సరాల్లో ఒక్కసారే నిర్వహించారు. మోడీ సర్కార్ తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో భాగంగానే ఈ పరీక్ష నిర్వహించటం లేదు'' అని కమాల్ చెప్పారు.
వెబ్సైట్ పనిచేయటం లేదు..
ఎయిర్‌మెన్ ఖాళీల కోసం ఏర్పాటుచేసిన వెబ్సైట్ పనిచేయటం లేదు. దీనిపై కేంద్రం ఎలాంటి వివరణా ఇవ్వలేదు. 2021లో పరీక్షల నిమిత్తం అభ్యర్థుల దరఖాస్తుల ద్వారా రూ.15,85,62,250 ప్రభుత్వానికి చేరింది. మరి ఈ డబ్బు ఏమైంది? ఆ వెబ్సైట్ ఎందుకు పనిచేయడం లేదు? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. పలువురు అభ్యర్థులు ఆర్టీఐ దరఖాస్తు ద్వారా సమాచారాన్ని కోరినా..కేంద్రం నుంచి రావటం లేదు. ఎయిర్‌మెన్ ఖాళీలలకు అగ్నిపథ్ పథకం కింద 'అగ్నివీర్వాయు'గా అభ్యర్థుల్ని నమోదు చేయడం జరుగుతుందని వైమానికదళ ప్రధాన కార్యాలయం తెలిపింది. అభ్యర్థుల నమోదు ప్రక్రియకు వెబ్‌సైట్‌ను కూడా ఏర్పాటుచేసింది. మరి..2021లో నిర్వహించిన పరీక్ష ఏమైందన్నది గందరగోళంగా తయారైంది. ఈ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుందా? లేదా? అన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వటం లేదు.