Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరువారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
- మోడీ ఎనిమిదేండ్లు వృథా చేశారు : ఏచూరి
న్యూఢిల్లీ : లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల అంశంపై ఆరువారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లు-2008ని తిరిగి ప్రవేశపెట్టాలని కోరుతూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జె.కె మహేశ్వరిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషనర్ ప్రాముఖ్యత కలిగిన సమస్యను లేవనెత్తారని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కాను అగర్వాల్ వాదనలు వినిపిస్తూ ఈ అంశం నిర్వహణలో తీవ్రమైన సమస్య తలెత్తిందని అన్నారు. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ మహిళ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్లను ప్రవేశపెట్టడానికి రాజ్యాంగ సవరణను ప్రతిపాదించిందని తెలిపారు. తొలి మహిళా రిజర్వేషన్ బిల్లను ప్రవేశపెట్టి 25 ఏండ్లు అయిందని అన్నారు. ఈ బిల్లు 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిందనీ, అయితే ఆ తరువాత లోక్సభ రద్దయిందని తెలిపారు. రాజ్యసభ ఆమోదం పొందినప్పటికీ లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టలేదని అన్నారు. బిల్లును ప్రవేశపెట్టకపోవడం ఏకపక్ష, చట్టవిరుద్ధం, వివక్షకు దారితీస్తోందని పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఆరు వారాల్లో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని, దానికి పిటిషనర్ రిజాయిండర్ అఫిడవిట్ మూడు వారాల్లో దాఖలు చేయాలని పేర్కొంది. తదుపరి విచారణను 2023 మార్చి నాటికి వాయిదా వేసింది.
ఇదీ జుమ్లా సిరీసే : ఏచూరి
'2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన వెంటనే, మహిళా రిజర్వేషన్ను చట్టబద్ధం చేయడం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని మోడీ ప్రకటించారు. 8 ఏండ్లు వృథా అయిపోయాయి. ఇది ఇప్పుడు రూ.15 లక్షలు, 10 కోట్ల ఉద్యోగాలు, 100 కొత్త స్మార్ట్ సిటీలు వంటి 'జుమ్లా' సిరీస్లో జోడయింది?'' అని పేర్కొన్నారు.